Amaravati Farmers Meet Bhuvaneshwari: మీ త్యాగాలు వృథా కావు.. అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది.. రాజధాని రైతులతో నారా భువనేశ్వరి - China Rajappa Comments on CM Jagan

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 4:44 PM IST

Amaravati Farmers Meet Bhuvaneshwari: పోలీసుల అడ్డంకుల అనంతరం రాజమండ్రిలో నారా భువనేశ్వరిని అమరావతి రాజధాని రైతులు కలిశారు. భువనేశ్వరిని కలిసిన రైతులు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కొందరు రైతులు కంటతడి పెట్టుకున్నారు. ఆమెకు సంఘీభావం తెలిపి.. చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ..  రైతుల త్యాగాలు వృథా కావని.. అమరావతి నిర్మాణం జరిగి తీరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అడ్డదారిలో వస్తోందని.. రైతులు ధైర్యంగా అన్నీ ఎదుర్కోవాలని సూచించారు. క్లిష్ట సమయంలో ప్రజల మద్దతు కొండంత ధైర్యాన్ని ఇస్తోందని అన్నారు. ఓట్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అదే ఆయుధమని సూచించారు.

అమరావతి రైతుల రాక బలాన్నిచ్చిందని అభిప్రాయపడ్డారు. మహిళల పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని.. ఈ ప్రభుత్వానికి మహిళల శక్తి తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరితో ఓటు వేయించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు జైలులో ఉన్నా మానసికంగా బలంగా ఉన్నారని వివరించారు. చంద్రబాబు మచ్చ లేకుండా బయటకు వస్తారన్నారు. అమరావతి రైతులు కూడా ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు.

ఈ రోజు ఉదయం భువనేశ్వరిని పరామర్శించేందుకు వెళ్తున్న అమరావతి రైతుల్ని పోలీసులు అడ్డుకున్నారు.  ప్రత్యేక బస్సుల్లో బయలుదేరిన రైతుల్ని వీరవల్లి, నల్లజర్ల టోట్‌ గేట్ల వద్ద అడ్డుకున్నారు. రాజమహేంద్రవరం వెళ్లేందుకు అనుమతి లేదని బస్సుల్ని నిలిపివేశారు. బస్సు డ్రైవర్లను పోలీసులు బలవంతంగా దించేశారు. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం వెళ్లేందుకు అనుమతి ఎందుకని ప్రశ్నించారు.తామేమీ పాకిస్తాన్ నుంచి రాలేదని మహిళలు ఆక్రోశించారు.

స్కిల్​ కేసులో ఆరోపణలతో అరెస్టైనా టీడీపీ అధినేత చంద్రబాబును.. ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేశ్​ సతీమణి బ్రాహ్మణి, మాజీ హోం మంత్రి చిన్నరాజప్ప ములాఖాత్​ ద్వారా కలిశారు. ఈ సందర్బంగా చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చినట్లు.. తెలుగుదేశం సీనియర్ నేత చినరాజప్ప తెలిపారు. ఆయన చాలా ధైర్యంగా ఉన్నారని, న్యాయ పోరాటంలో గెలుస్తామని చెప్పినట్లు వివరించారు.  

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా చంద్రబాబుకు అండగా నిలవాలని, వచ్చే ఎన్నికల్లో ఓటుతో జగన్‌కు గుణపాఠం చెప్పాలని చినరాజప్ప కోరారు. చంద్రబాబు చాలా ధైర్యంగా ఆరోగ్యంగా ఉన్నారని.. కుటుంబ సభ్యులను, పార్టీ కార్యకర్తలను ధైర్యంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారని తెలిపారు. తప్పుడు కేసులపై పోరాటం చేసి ప్రజలకు అవగాహన కలిగించాలని.. పోరాటంతోనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు సూచించినట్లు వివరించారు. చంద్రబాబును తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేయడంతో.. సీఎం జగన్​కు ఇప్పుడు భయం పట్టుకుందని.. బెయిల్ రాకుండా జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మనసంతా రాష్ట్రం పైనే వుందని.. రాష్ట్రం నాశనమై పోతుందని బాధపడుతున్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.