Praggnanandhaa: సంచలనాలు నమోదు చేయడం అలవాటుగా మార్చుకున్న భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి అద్భుతాన్ని అందుకున్నాడు. అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు ఈ 17 ఏళ్ల చెన్నై కుర్రాడు మళ్లీ షాకిచ్చాడు. నార్వే దిగ్గజంపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాదిలోనే అతనిపై మూడోసారి పైచేయి సాధించడం విశేషం. తాజాగా ఛాంపియన్స్ చెస్ టూర్‌లో భాగంగా జరిగిన ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ చివరి రౌండ్లో ప్రజ్ఞానంద 4-2 తేడాతో ప్రపంచ నంబర్‌వన్ కార్ల్‌సన్‌ను చిత్తుచేశాడు. అయినప్పటికీ మొత్తం ఏడు రౌండ్లు ముగిసే సరికి 15 పాయింట్లతో అతను రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 16 పాయింట్లతో కార్ల్‌సన్ వరుసగా రెండో ఏడాదీ టైటిల్ గెలుచుకున్నాడు. ఇప్పటికే రెండు సార్లు ఆన్‌లైన్ టోర్నీల్లో కార్ల్‌సన్‌పై గెలిచిన ప్రజ్ఞానంద.. ఈ సారి కూడా అదే జోరు కొనసాగించాడు.
"రన్నరప్‌గా నిలవడంతో 37500 అమెరికా డాలర్లు గెలిచానని కూడా తెలీదు. కార్ల్‌సన్‌ను ఓడించడం మాత్రం ఆనందాన్నిస్తోంది. కానీ ఇది కూడా ఓ సాధారణ పోరు లాగే భావించా. తొలి గేమ్ గెలవాల్సింది కానీ డ్రా అయింది. రెండో గేమ్‌లో ఓటమిని తప్పించుకున్నా. మూడో గేమ్‌లో గట్టిగానే ప్రయత్నించా. కానీ ఈ సారి ఓటమి ఎదురైంది. ఇక నాలుగో గేమ్‌లో విజయం కోసం మంచి అవకాశాలు ఏర్పడ్డాయి. ఆ గేమ్ సరదాగా అనిపించింది. గేమ్ పూర్తి కాగానే కోచ్ రమేశ్ సర్‌తో చర్చిస్తా. తర్వాతి గేమ్‌లో అనుసరించే వ్యూహాలపై కసరత్తు చేస్తాం. అన్ని మ్యాచ్‌లు ఉత్తేజితంగా సాగాయి. ఎలాంటి ఆందోళన లేకుండా మాగ్నస్‌ను ఓడించాలని మ్యాచ్‌కు ముందు అక్క (వైశాలి) సందేశం పంపించింది. ప్రశాంతంగా ఉంటూ తలపడడం కలిసొచ్చింది. అమెరికా కాలమానానికి అలవాటు పడేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఇప్పుడు సంబరాలకు సమయం లేదు. దుబాయ్ ఓపెన్ కోసం వెళ్లాల్సి ఉంది. ఇలా ఎదురెదురుగా కంప్యూటర్ తెరలపై కాకుండా నేరుగా బోర్డుపై ఆడడానికే ప్రాధాన్యతనిస్తా."
- ప్రజ్ఞానంద
అదో గ్రాండ్ మాస్టర్ల ఇల్లు..
మాగ్నస్ కార్ల్‌సన్.. చెస్‌లో అరవీర భయంకరుడు. ప్రత్యర్థులు కోలుకోలేని విధంగా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడంలో దిట్ట. తన దూకుడైన ఆటతీరునే ఆయుధంగా చేసుకొంటాడు. అలాంటి కార్లసన్‌ను చెన్నైకి చెందిన 16ఏళ్ల కుర్రాడు మూడు నెలల్లో రెండు సార్లు ఓడించాడు. అతడి పేరే రమేశ్‌బాబు ప్రజ్ఞానంద. బాల్యంలో ఎవరైనా కొత్త విషయాలు అత్యంత వేగంగా నేర్చుకొంటారు. ఆ సమయంలో వారిని తల్లిదండ్రులు తీర్చిదిద్దితే.. భారత్‌లో ఛాంపియన్లు పుట్టుకురావడం తేలికే అని నిరూపించాడు. చిన్నప్పుడు అక్కను చూసి చదరంగం నేర్చుకొని.. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్లకు చెమటలు పట్టిస్తున్నాడు.
కార్టూన్లు మాన్పించేందుకు..
Pragnanandha Family: చెన్నైలో బ్యాంకు ఉద్యోగి రమేష్ బాబు, నాగలక్ష్మి దంపతులకు 2005లో ప్రజ్ఞానంద జన్మించాడు. ప్రజ్ఞానందకు ఓ అక్క కూడా ఉంది. ఆమె పేరు వైశాలి. వైశాలి చిన్నప్పుడు టీవీలో కార్టూన్లు ఎక్కువగా చూస్తోందని ఆమె తల్లి నాగలక్ష్మి ఆందోళన చెందింది. ఆ చిన్నారి దృష్టిని ఏదైనా ఆటపైకి మళ్లించాలని భావించి చెస్ నేర్పించింది. దీంతో చిన్నారి వైశాలి మెల్లిగా చదరంగంపై పట్టు సాధించింది. ఐదేళ్లు రాగానే బ్లూమ్ చెస్ అకాడమీలో ఆ చిన్నారిని చేర్పించారు. అద్భుతంగా రాణించిన వైశాలి.. అండర్-11,13,15ల విభాగంలో దేశస్థాయిలో బంగారు పతకాలు సాధించింది. 2015లో నేషనల్ ఛైల్డ్ అవార్డును నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అందుకొంది.
అక్క సాధిస్తోన్న అద్భుత విజయాలను చూస్తూ పెరిగిన ప్రజ్ఞానంద కూడా చదరంగం వైపు ఆకర్షితుడయ్యాడు. అలా అక్కాతమ్ముళ్లు ఇద్దరూ చెస్‌పై ఆసక్తి పెంచుకోవడంతో రమేష్‌బాబు- నాగలక్ష్మి దంపతులు సంతోషించారు. ఇద్దర్నీ టోర్నిలకు తీసుకెళ్లడంతో పాటు ఇంటి దగ్గర వాళ్ల ప్రాక్టిీస్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ తల్లి ప్రోత్సహించేది. ప్రముఖ కోచ్ ఆర్.బి. రమేష్ బాబుకు చెందిన చెస్ గురుకుల్‌లో వీరు ఆయా టోర్నిలకు ముందు మూడు నెలలు శిక్షణ తీసుకొనే వారు.
గ్రాండ్ మాస్టర్ హోదా లభిస్తుందని తెలియకుండానే..
మరోవైపు ప్రజ్ఞానంద అద్భుతంగా రాణిస్తూ ఏడేళ్ల వయస్సులోనే వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్ షిప్(2013)ను గెలిచాడు. దీంతో ఫిడే మాస్టర్స్ హోదా అందుకొన్నాడు. ఆ తర్వాత 2015లో అండర్-10 టైటిల్ సాధించాడు. 2016లో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా దక్కించుకొని సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత 2018 జూన్‌లో ఇటలీలో జరిగిన గ్రెడిన్ టోర్నిలోని 8వ రౌండ్‌లో లుకా మురోనిని ఓడించి గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకొన్నాడు. అతిపిన్న వయస్సులో ఈ హోదా దక్కించుకొన్న వారిలో ఆల్‌టైమ్ రికార్డుల్లో 5 స్థానంలో నిలిచాడు. వాస్తవానికి ఆ గేమ్ ఆడటానికి ముందు వరకు గ్రాండ్‌మాస్టర్ అయ్యే అవకాశం ఉందన్న విషయం ప్రజ్ఞానందకు తెలియదని కోచ్ రమేష్‌బాబు వెల్లడించారు. ఒత్తిడి పెంచడం ఎందుకని తాము కూడా ఆ విషయాన్ని వెల్లడించలేదన్నారు. మరోపక్క వైశాలి కూడా 2018 ఆగస్టులో విమెన్స్ గ్రాండ్ మాస్టర్ హోదాను దక్కించుకొంది.
వాస్తవానికి గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకోవడం ఆషామాషీ కాదు. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ పేర్కొన్న పలు రకాల కఠిన కొలమానాల్లో ఇమడాలి. విశ్వనాథన్ ఆనంద్ వంటి దిగ్గజానికి కూడా 18వ ఏట 1988లో గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కిందంటే ఆ నియమాలు ఎంత కఠినంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
ఆర్థిక ఇబ్బందులను లెక్కచేయకుండా..
రమేష్‌బాబు దంపతులు పిల్లలను టోర్నిలకు సిద్ధం చేయడానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. 2011లో వైశాలి ‘ది ఏసియన్ యూత్ ఛాంపియన్ షిప్’కు ఎంపికైంది. జాతీయ స్థాయిలో మూడో స్థానంలో ఉన్న ఓ బాలిక టోర్ని నుంచి వైదొలగడంతో నేషనల్ అండర్-10లో నాలుగో స్థానంలో ఉన్న వైశాలికి పిలుపు వచ్చింది. ఈ టోర్నిలో ఆడేందుకు ఫిలిప్పీన్స్‌కు వెళ్లాల్సి వచ్చింది. కానీ, ప్రభుత్వ స్పాన్సర్లు తొలి మూడు స్థానాలకే ఉండటంతో ఆమెకు మద్దతు లభించలేదు. దీంతో వైశాలి తండ్రి సొంత డబ్బు రూ.90వేలు ఖర్చుపెట్టాల్సి వచ్చింది.
ఇద్దరు పిల్లలు టోర్నిలకు వెళ్లినప్పుడు తల్లి నాగలక్ష్మి కూడా వారితోనే ఉండేది. హోటళ్లలో ఆహారం ఖరీదు ఎక్కువగా ఉండటంతో తనతోపాటు రైస్‌కుక్కర్ తీసుకెళ్లి పిల్లలకు పెరుగన్నం, సాంబారన్నం, రసమన్నం వండిపెట్టేదాన్నని.. ఆమె స్వయంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.
చదరంగపు శక్తిగా భారత్..
భారత్‌లో ఇప్పటి వరకు 73 మంది గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు. 2007లో ఈ సంఖ్య కేవలం 20 మాత్రమే. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రపంచ టాప్ 100 ర్యాంకింగ్స్‌లో ఏడుగురు భారతీయ ఆటగాళ్లు ఉన్నారు. దాదాపు 50 వేల మంది చదరంగపు క్రీడాకారులు రిజిస్టరై ఉన్నారు. వీరు కాకుండా స్థానిక టోర్నీలు ఆడే 10 లక్షల మంది వరకు క్రీడాకారులు ఉండొచ్చని అంచనా. ప్రజ్ఞానందతో పాటు నిహాల్ సరీన్, అర్జున్ రేగసీ, దొమ్మరాజు గుకేష్ వంటి వారు భారతీయ చదరంగపు భవిష్యత్తు తారలుగా ఎదుగుతున్నారు.
ఇవీ చదవండి: మూడు ఫార్మాట్లలో ఇద్దరూ రాణిస్తున్నారు, తర్వాతి కెప్టెన్ ఎవరంటే
భయపెట్టిన జింబాబ్వే, త్రుటిలో ఓటమి తప్పించుకున్న భారత్, సిరీస్ క్లీన్ స్వీప్