వివాదాస్పద వ్యాఖ్యలతో కొద్దికాలంగా హాట్‌టాపిక్‌గా మారిన కన్నడ హీరో దర్శన్‌కు చేదు అనుభవం ఎదురైంది. చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న ఆయనపై ఓ వ్యక్తి చెప్పు విసిరి దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జరిగిందేంటంటే.. దర్శన్ ప్రస్తుతం 'క్రాంతి' అనే చిత్రంలో నటించారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లో భాగంగా.. ఓ సాంగ్ విడుదల కోసం కర్ణాటకలోని హోస్పేట్‌లో ఓ ఈవెంట్‌ను నిర్వహించింది మూవీటీమ్. ఇందులో దర్శన్ పాల్గొనగా.. అతడిని చూసేందుకు చాలా మంది అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే ఆయన స్టేజీపై నిలబడి అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఆయనపై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, ఈ ఘటనపై కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన తన మనుసును బాధించిందని చెప్పారు. ఎవరూ మానవత్వాన్ని మరిచి ఇలాంటి అమానవీయ ఘటనలకు పాల్పడవద్దని కోరారు. అభిమానంతో ప్రేమను చూపించండి. అంతేగానీ ద్వేషం, అగౌరవంగా ప్రదర్శించకూడదన్నారు.
ఇదే కారణమా.. ఇటీవల దర్శన్.. ఓ ఇంటర్వ్యూలో అదృష్ట దేవతపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అదృష్ట దేవత ఎప్పుడూ తలుపు తట్టదని, ఆమె తలుపు తట్టినప్పుడు చెయ్యి పట్టుకుని బెడ్ రూమ్‌లోకి లాగి వివస్త్ర చేయాలని అన్నారు. ఒకవేళ ఆమె ఒంటి మీద దుస్తులు ఉంటే బయటకు వెళ్ళిపోతుందని, అదే వివస్త్ర చేస్తే మనతోనే ఉండిపోతుందని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను కించపరచడం అని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు మహిళలపై దాడులు చేసే వాళ్ళను ప్రేరేపించే విధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే ఈ అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఇప్పుడీ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
గతంలోనూ ఇంకో ఇంటర్వ్యూలో.. దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు దర్శన్. "నా అభిమానులు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఉదాహరణకు పునీత్‌ను తీసుకోండి.. ఆయన చనిపోయిన తర్వాత విశేష ఆదరణ చూపిస్తున్నారు. కానీ, నేను బతికి ఉండగానే ఫ్యాన్స్ ప్రేమను పొందుతున్నాను" అని అన్నారు. ఆ వ్యాఖ్యలు కూడా అంతటా దుమారాన్ని రేపాయి. ఒకవేళ ఇది కూడా తాజాగా జరిగిన ఘటనకు కారణమవ్వొచ్చని అంటున్నారు.
ఇదీ చూడండి: భూతకోల ఉత్సవాల్లో అనుష్క.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!