Bhool Bhulaiyaa 2 Kiara Advani: హారర్ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'భూల్ భులైయా 2'. కార్తీక్ ఆర్యన్ కథానాయకుడు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించాడు. మే 20న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇందులో ప్రధాన పాత్ర పోషించిన కియరా అడ్వాణీ తన పాత్రను పరిచయం చేసింది.

"రీత్‌ని పరిచయం చేసుకోండి... కానీ తను మీరనుకున్నంత మంచిది కాదు" అంటూ మోషన్ పిక్చర్‌ను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. 2007లో అక్షయ్ కుమార్ నటించిన 'భూల్ భూలైయా 1' కు కొనసాగింపుగా ఈ చిత్రం వస్తోంది. భూషణ్ కుమార్, మురాద్ ఖేతని, అన్‌జుం ఖేతని, కృష్ణన్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

అందుకే వెళ్లగలుగుతున్నా: బాలీవుడ్ యువ కథానాయిక భూమి పెడ్నేకర్ ప్రస్తుతం 'ది లేడీ కిల్లర్' చిత్రంలో నటిస్తోంది. కథానాయకుడు అర్జున్ కపూర్. అజయ్ బహ్‌ల్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ కోసం ఈ బృందం త్వరలోనే మనాలీ వెళ్లనుంది. ఈ సందర్భంగా భూమి తన ఆనందాన్ని పంచుకుంది.

"నా వృత్తి వల్లే నేను ఎపుడూ చూడని ప్రదేశాలను చూడగలుగుతున్నాను. వివిధ ప్రదేశాల అందాలను, సంస్కృతిని చూసే అదృష్టం దక్కింది. మనాలీలో తొలి సారి షూటింగ్‌లో పాల్గొనడానికి ఎదురుచూస్తున్నా.." అంది. ప్రయాణాలంటే ఇష్టపడే ఈ భామ తను మొదటి సారిగా మనాలీకి వెళ్తుండటం వల్ల ఎగిరిగంతేస్తోంది. చిన్న పట్టణంలో జరిగే ఒక రొమాంటిక్ థ్రిల్లర్‌గా 'ది లేడీ కిల్లర్' తెరకెక్కుతోంది.

'ఫాస్ట్ ఎక్స్': ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులకు పరిచయమున్న సిరీస్ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్'. అందులో నటించిన విన్ డీజిల్ అంటే అందరికీ పిచ్చి క్రేజ్. ఆ సిరీస్‌లో రానున్న తర్వాతి సినిమా టైటిల్‌ను విన్ 'ఫాస్ట్ ఎక్స్'గా ప్రకటించాడు. గతంలో కొన్ని 'ఎఫ్ అండ్ ఎఫ్' సినిమాలకు దర్శకత్వం వహించిన జస్టిన్ లిన్ ఈ చిత్రానికి దర్శకుడు. కొద్ది రోజుల క్రితమే 'కెప్టెన్ మార్వెల్' భామ బ్రీ లార్సన్ ఎఫ్ అండ్ ఎఫ్ బృందంలో చేరినట్లు ప్రకటించారు. జాసన్ మొమోవా ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.

ఈ సిరీస్‌కు సంబంధించి తర్వాతి వచ్చే చిత్రమే ఆఖరిదని తెలుస్తోంది. ఇది రెండు భాగాలుగా రానుంది. వీటిలో మొదటి భాగమైన 'ఫాస్ట్ ఎక్స్' 2023 మే 19న విడుదల అవుతుందని తెలుస్తోంది. కార్లతో దుమ్ము రేపే పోరాటాలు, ఉత్కంఠ కలిగించే యాక్షన్ ఎపిసోడ్లతో ప్రేక్షకులను సీటు అంచులకు తీసుకొచ్చే ఈ సిరీస్‌పై అంచనాలు ఎక్కువగా ఉంటాయి.
ఇదీ చూడండి: బోల్తా కొట్టిన డబ్బింగ్ సినిమాలు.. ఆ ఒక్కటి మినహా!