చైనా సాంకేతికతపై భారత్, అమెరికాల బాటలోనే బ్రిటన్ పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనా టెక్ కంపెనీలతో అంతర్గత భద్రతకు ముప్పు ఉందనే కారణాలతో హువావేను దేశీయ 5జీ నెట్వర్క్ నుంచి తప్పించేందుకు బ్రిటన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
హువావేను దశల వారీగా బ్రిటన్ 5జీ టెక్నాలజీ నుంచి తప్పించే ప్రక్రియను ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు ది డెయిలీ టెలిగ్రాఫ్ అనే పత్రిక కథనాన్ని ప్రచురించింది.
ఇందులో భాగంగా 5జీ నెట్‌వర్క్‌లో 'హువావే టెక్నాలజీస్' పరికరాల వినియోగాన్ని ఆరు నెలల్లో నిలిపివేసేందుకు బ్రిటన్ యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే వినియోగించిన పరికరాల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేసే అంశం కూడా అందులో ఉన్నట్లు రాసుకొచ్చింది.
భద్రతకు ముప్పు..
చైనా టెక్నాలజీ నుంచి అంతర్గత భద్రతకు ముప్పు ఉన్నట్లు బ్రిటన్ నిఘా సంస్థ జీసీహెచ్‌క్యూ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆంక్షల దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై బ్రిటన్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఓ నివేదకను తయారు చేసింది. ఈ వారంలో బోరిస్ జాన్సన్ ముందుకు నివేదికను తీసుకెళ్లే అవకాశం ఉంది.
భారత్, అమెరికా చర్యలు..
దేశీయ అంతర్గత భద్రతకు ముప్పు ఉందని.. ఇటీవల 59 చైనా యాప్‌లపై నిషేధం విధించింది భారత్. సరిహద్దుల్లో గల్వాన్ లోయ వద్ద భారత సైనికులపై చైనా బలగాలు అక్రమంగా దాడి చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొంది భారత్. యాప్‌ల నిషేధంపై పూర్తి కథనాన్ని ఇక్కడ చదవండి
కరోనా వ్యాప్తితోపాటు పలు ఇతర అంశాలపై చైనాపై ఇప్పటికే అమెరికా గుర్రుమీద ఉంది. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన టెక్ సంస్థలు హువావే, జెడ్టీఈల నుంచి అంతర్గత భద్రతకు ముప్పు ఉందని ప్రకటించింది. దీనిని నివారించేందుకు ఆయా సంస్థల నుంచి దేశీయ టెలికాం కంపెనీలు చేసే కొనుగోళ్లపై నిషేధం విధించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి