కేంద్ర సాయుధ బలగాల తరహాలో అత్యంత కఠినమైన పరిస్థితుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న 92 మంది మహిళా కమాండోలు(women commando) బిహర్ పోలీసు విభాగంలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఉగ్రవాద నిర్మూలన, ప్రత్యేక భద్రతపై మహారాష్ట్ర ముధ్‌ఖెడ్‌లోని సీఆర్‌పీఎఫ్ శిక్షణా కేంద్రంలో వీరు శిక్షణ పూర్తిచేసుకున్నారు. త్వరలోనే బిహార్ పోలీసు విభాగంలో చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
బిహార్ పోలీసు విభాగానికి చెందిన మహిళలకు తీవ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు, వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఇటీవల బిహార్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రాష్ట్రంలోని వివిధ బెటాలియన్ల నుంచి ముందుగా 134 మంది మహిళలను(women commando) ఎంపిక చేసింది. పలు కారణాలు దృష్ట్యా వీరిలో 92 మంది మాత్రమే శిక్షణ కోసం వెళ్లారు. మొదట పట్నా, దిల్లీ శిక్షణా కేంద్రాల్లో ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకున్నారు. అనంతరం జూన్ 26న మహారాష్ట్రలోని ముధ్‌ఖెడ్‌లోని సీఆర్‌పీఎఫ్ శిక్షణా కేంద్రంలో చేరి కేంద్ర సాయుధ బలగాల తరహాలో కఠిన శిక్షణ పూర్తిచేసుకున్నారు.
మహారాష్ట్రలోని సీఆర్‌పీఎఫ్ శిక్షణా కేంద్రంలో ఈ మహిళా కమాండెంట్లు(women commando) దాదాపు మూడు నెలలకు పైగా శిక్షణ పొందారు. దీనిలో భాగంగా వారం రోజుల పాటు కారడవుల్లో కఠిన పరిస్థితుల మధ్య గడిపినట్లు అధికారులు తెలిపారు. యుద్ధ నైపుణ్యాలు, అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించే విధంగా తర్ఫీదు పొందినట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణం స్పందించి హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టేలా అనుభవం పొందారని తెలిపారు.
ప్రస్తుతం విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న 92 మందిని ముఖ్యమంత్రి సహా ప్రముఖులకు రక్షణ కల్పించే ఎస్ఎస్జీ విభాగంలో నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు.. పోలీసు విభాగంలో చేరేలా మహిళలను ప్రోత్సహించే విధంగా బిహర్ ప్రభుత్వం మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తోంది.
ఇదీ చూడండి: ఎన్డీఏలో మహిళల ప్రవేశ పరీక్షలపై కేంద్రం క్లారిటీ