లాక్డౌన్లో సేవలందిస్తున్న పోలీసుల సేవలను గుర్తించిన కేరళలోని త్రిపూనితురా మొదటి బెటాలియన్ పోలీసు విభాగం... వారికోసం ఓ ప్రత్యేక వాహనాన్ని రూపొందించింది. సకల సౌకర్యాలు అందుబాటులో ఉండే ఈ ప్రత్యేక 'మల్టీ పర్పస్ వ్యాన్'.. ఇప్పుడు కొచ్చి నగరంలోని పోలీసుల అవసరాలు తీరుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ప్రత్యేక సౌకర్యాలివే..
శరీర ఉష్ణోగ్రతను అంచనా వేసే థర్మల్ స్క్రీనింగ్ నుంచి హెయిర్కట్టింగ్ వరకు అన్ని సౌకర్యాలు ఇందులోనే ఉంటాయి. లాక్డౌన్ కారణంగా ఎండలో నిల్చొని విధులు నిర్వర్తిస్తోన్న పోలీసులకు.. అవసరమైన సమయంలో విశ్రాంతి తీసుకునేలా స్నాక్స్, తేనీరు వంటి సదుపాయాలను కల్పిస్తోందీ వాహనం. అంతేకాకుండా.. క్షవరం చేయించుకునేందుకు వీలుగా ఇందులో మినీ సెలూన్నే ఏర్పాటు చేశారు. ఇంకా.. ఈ వాహనంలోకి ప్రవేశించేముందు చేతులను శానిటైజ్ చేసుకుని, గ్లోవ్స్‌ను ధరించాల్సిందే.
ఇతర సేవలు..
వ్యాధి నిరోధక శక్తిని పెంచే 'ఇమ్యూన్ టీ', గ్లూకోజ్, నిమ్మరసం వంటివి కూడా ఈ వాహనంలో అందుబాటులో ఉంటాయి. పోలీసులు విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా ఉండే ఈ వాహనంలో ఓ టెలివిజన్, లౌడ్ స్పీకర్లనూ అమర్చారు. మహిళా పోలీసులకూ విశ్రాంతి తీసుకునే సదుపాయం మరో ప్రత్యేకత. వాటితో పాటు ప్రథమ చికిత్సకు అవసరమైన మందులతో పాటు వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) కిట్లు ఈ వాహనంలో ఉంటాయి.
3 రోజుల్లోనే..
కొవిడ్ నేపథ్యంలో నగరవ్యాప్తంగా విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు.. ఈ వాహనం అన్నిరకాల సేవలందిస్తోంది. పోలీస్ బలగాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు ఉపయోగించిన పాత వాహనాన్ని కేవలం 3 రోజుల్లోనే ఇలా విభిన్నంగా తీర్చిదిద్దారు. మల్టీ పర్పస్ వెహికల్ తయారీలో ఐపీఎస్ అధికారి డాక్టర్ వైభవ్ సక్సేనా, ఇతర సీనియర్ అధికారుల కృషి ఎనలేనిదని ఓ పోలీసు అధికారి ప్రశంసించారు.
ఇదీ చదవండి: ఆర్మీ ఆసుపత్రిలో 24 మందికి కరోనా పాజిటివ్