గుండెకు సమీపంలో ఇరుక్కుపోయిన కృత్రిమ దంతాన్ని క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి వైద్యులు బయటకు తీశారు. ఆహారం తింటుండగా దంతాన్ని మింగేశాడు ఓ వ్యక్తి. అది గొంతు లోపలికి వెళ్లి గుండెకు, ఊపిరితిత్తులకు మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో కఠినమైన సర్జరీ చేసి బాధితుడిని కాపాడారు బిహార్ పట్నాలోని పరాస్ ఆస్పత్రి వైద్యులు.
ఇదీ జరిగింది..
బెగుసరాయ్‌కు చెందిన సురేంద్ర కుమార్(45).. గతంలో పై దవడకు కృత్రిమ దంతం పెట్టించుకున్నారు. ఆహారం తింటుండగా.. అనుకోకుండా ఆ దంతం ఊడిపోయింది. దాన్ని కొక్కెంతో సహా మింగేశాడు సురేంద్ర. దీంతో విపరీతమైన నొప్పి తలెత్తింది. వెంటనే బెగుసరాయ్‌లోని ఓ ప్రైవేటు క్లినిక్‌లో చికిత్స చేయించుకున్నారు. ఎండోస్కోపీ నిర్వహించి దంతాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు అక్కడి వైద్యులు. కానీ అది సాధ్యపడలేదు. పట్నాకు వెళ్లాలని వైద్యులు సూచించారు. వెంటనే కుటుంబ సభ్యులు బాధితుడిని పరాస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
పట్నాకు చేరుకునేసరికి సురేంద్ర పరిస్థితి విషమించింది. హుటాహుటిన పరీక్షలు నిర్వహించిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. ఆహారనాళం 10 సెంటీమీటర్ల మేర చీలిపోయినట్లు సీటీ స్కాన్‌లో గుర్తించారు. ఆహారనాళం నుంచి బయటకు వచ్చిన దంతం.. ఊపిరితిత్తులు, గుండెకు మధ్యలో ఇరుక్కుపోయింది. ఫలితంగా బాధితుడి ఛాతిలో ఇన్ఫెక్షన్ తలెత్తింది.
దంతానికి మెటల్ కొక్కెం ఉన్నందున ఆపరేషన్ చేయడం చాలా క్లిష్టమైందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఏడుగురు వైద్యులతో కూడిన ప్రత్యేక టీమ్‌ను రంగంలోకి దించి ఆపరేషన్‌పై ఎలా ముందుకెళ్లాలని తొలుత చర్చించినట్లు ఆస్పత్రి సర్జరీ విభాగం డైరెక్టర్ ఏఏ హయీ తెలిపారు. 'ముందుగా ఛాతిలో ఇన్ఫెక్షన్ తలెత్తిన ప్రాంతాన్ని శుభ్రం చేశాం. థొరకోస్కోపీ నిర్వహించి అక్కడ పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాం. అనంతరం సర్జరీ నిర్వహించి దంతాన్ని సురక్షితంగా బయటకు తీశాం. ఈ ఆపరేషన్‌కు నాలుగు గంటల సమయం పట్టింది' అని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సురేంద్ర ఆరోగ్యం మెరుగుపడిందని, క్రమంగా కోలుకుంటున్నారని స్పష్టం చేశారు.