చిలుక కోసం స్పెషల్ మెట్రో నడిపిన అధికారులు- ఎందుకో తెలుసా? - Nagpur Metro Runs Train For Parrot
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2024/640-480-20747108-thumbnail-16x9-parrot-struck-on-metro-bridge-saved.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Feb 14, 2024, 2:26 PM IST
|Updated : Feb 16, 2024, 5:20 PM IST
Nagpur Metro Run For Save Parrot : మెట్రో బ్రిడ్జి తీగలకున్న మాంజాలో చిక్కుకున్న ఓ చిలుక ప్రాణాలను కాపాడేందుకు ఏకంగా స్పెషల్ ట్రైన్‌ను నడిపింది మహారాష్ట్రలోని నాగ్‌పుర్ మెట్రో. ఇందుకు ఓ యువకుడి ప్రయత్నం తోడవడం వల్ల ఆ చిలుక స్వల్పగాయాలతో సేఫ్‌గా బయటపడింది. ఇంతకీ ఏం జరిగిందంటే
మంగళవారం సాయంత్రం నాగ్‌పుర్ నగరంలోని గడ్డి గోడౌన్ మెట్రో స్టేషన్‌కు సమీపంలోని బ్రిడ్జికు అమర్చిన తీగలకు ఓ చిలుక వేలాడుతూ కనిపించింది. గాలిపటాలు ఎగురవేసే నైలాన్ మాంజాలో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించింది చిలుక. దీనిని చూసిన స్థానికులు తొలుత అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది దానిని కాపాడటంలో విఫలమైంది. ఆ తర్వాత స్థానికంగా ఉండే అగ్నిమాపక శాఖకు ఫోన్ చేసి వారినీ పిలిపించారు. వీరు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా వంతెనపై చిక్కుకున్న చిలుకను చేరుకోలేకపోయారు.
ఈ క్రమంలో అక్కడే ఉన్న హరీశ్ కింకర్ అనే యువకుడు సమీపంలోని గడ్డి గోడౌన్ మెట్రో స్టేషన్‌కు చేరుకొని అక్కడి అధికారులతో మాట్లాడాడు. మెట్రో బ్రిడ్జిపై చిక్కుకున్న చిలుకను కాపాడేందుకు ట్రాక్ ద్వారా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా వారిని కోరాడు. ఇందుకు ఒప్పుకున్న మెట్రో యాజమాన్యం స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలో ఉన్న చిలుకను కాపాడేందుకు ప్రత్యేకంగా ఓ ట్రైన్‌ను నడిపారు. ఇందులో హరీశ్ కింకర్ కూడా ఉన్నాడు. అలా స్టేషన్ నుంచి 100 మీటర్లు ప్రయాణించి పట్టాలపైకి దిగాడు. అలా మెట్రో సిబ్బంది సాయంతో మాంజాలో ఇరుక్కున్న చిలుకను సురక్షితంగా కాపాడాడు. కాగా, ప్రాణాలతో బయటపడ్డ చిలుకకు స్వల్ప గాయాలవ్వడం వల్ల దానికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లుగా సంబంధిత అధికారులు తెలిపారు.