జమిలి ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపాలి : డీకే అరుణ - DK Aruna On One Nation One Election
🎬 Watch Now: Feature Video
Published : Sep 22, 2024, 3:07 PM IST
MP DK Aruna On One Nation One Election : జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం మానేసి, తెలంగాణ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. సికింద్రాబాద్లో సికింద్రాబాద్ అసెంబ్లీ ఇంఛార్జీ సారంగపాణి ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆమె హాజరై ఇంటింటా తిరుగుతూ సభ్యత్వ నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ క్రమంగా పెరుగుతోందని, స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు చేయించుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నట్లు తెలిపారు.
జమిలి ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయగా, కాంగ్రెస్ వ్యతిరేకించడం సరైన చర్య కాదన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడం మూలంగా దేశం అభివృద్ధి పదంలో మరింత ముందుకు దూసుకెళ్తుందని అన్నారు. గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగే ఆనవాయితీ ఉండేదని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆమోదయోగ్యమైన నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుబడి ఉండి, మద్దతు ఇవ్వాలని కోరారు. గ్రామీణ స్థాయి నుంచి దేశస్థాయి వరకు పూర్తి ఐదేళ్లు ఎన్నికలు జరుగుతుండటం దేశ అభివృద్ధికి ఆటంకంగా మారిందని, దీంతో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు.