మార్గదర్శి ఎండీకి లుకౌట్ నోటీసు కోర్టు ధిక్కరణే - ఫిబ్రవరి 19కు విచారణ వాయిదా - HC Hearing Margadarsi Case
🎬 Watch Now: Feature Video
Published : Jan 23, 2024, 8:54 AM IST
|Updated : Jan 24, 2024, 4:44 PM IST
Margadarsi Chit Fund Case Hearing in Telangana High Court : మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఎవరూ ఫిర్యాదు ఇవ్వలేదన్న కారణంగానే కఠిన చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు సీఐడీ న్యాయవాదిని ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా మార్గదర్శి ఆస్తుల జప్తునకు ఉత్తర్వులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశామన్న సీఐడీ న్యాయవాది వాదనను అడ్డుకుంది. కఠిన చర్యలు చేపట్టరాదంటూ గతేడాది మార్చిలో ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఎండీకి వ్యతిరేకంగా లుకౌట్ నోటీసు జారీ చేశారని మార్గదర్శి ఆస్తులను జప్తు చేశారని సీఐడీ అధికారులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ మార్గదర్శి ప్రైవేట్ లిమిటెడ్, సంస్థ ఎండీ శైలజ వైర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కె.సురేందర్ సోమవారం విచారణ చేపట్టారు.
మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, న్యాయవాది వాసిరెడ్డి విమల్‌వర్మ వాదనలు వినిపించారు. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా మార్గదర్శి ఎండీకి వ్యతిరేకంగా లుకౌట్ నోటీసులు జారీ చేశారన్నారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా అప్పుడు సర్క్యులర్ ఉపసంహరించుకున్నారని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు కోర్టు ధిక్కరణపై క్షమాపణ కోరుతూ అఫిడవిట్ దాఖలు చేశారని ఐతే అందులో బేషరతు క్షమాపణలు కోరలేదన్న విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని సీఐడీ తరఫు న్యాయవాది కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రెండు పిటిషన్లపైనా ఫిబ్రవరి 19న విచారణ చేపడతామంటూ వాయిదా వేశారు.