లండన్‌లో ఘనంగా బోనాల వేడుకలు - హాజరైన ప్రవాస భారతీయ కుటుంబాలు - Bonalu Celebrations In London - BONALU CELEBRATIONS IN LONDON
🎬 Watch Now: Feature Video
Published : Jul 13, 2024, 8:43 PM IST
Bonalu Celebrations In London : లండన్‌లో బోనాల జాతర వేడుకలు అంబరాన్నంటాయి. తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు యూకె నలుమూలల నుంచి సుమారు 1000 మందికి పైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. స్వదేశంలో నిర్వహించేటట్లుగానే సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. తొట్టెల ఊరేగింపు, పోతురాజు ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హౌంస్లౌ నగర డిప్యూటీ మేయర్ ముహమ్మద్ షకీల్ అక్రమ్ హాజరయ్యారు.
లండన్‌కు ఉన్నత చదువుల కోసం వచ్చిన ప్రవాస తెలంగాణ విద్యార్థి అక్షయ్ మల్చేలం తమ వంశ వృత్తిని మర్చిపోకుండా పోతురాజు వేషం ధరించి, బోనాల ఊరేగింపులో పాల్గొని వేడుకలకు సరికొత్త శోభ తీసుకొచ్చాడు. పోతురాజు విన్యాసాన్నీ ప్రవాసులే కాక హాజరైన ముఖ్య అతిథులు సైతం అభినందించి సత్కరించారు. యూకెలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటున్న తీరును హౌంస్లౌ నగర డిప్యూటీ మేయర్ ముహమ్మద్ షకీల్ అక్రమ్ ప్రశంసించారు.
విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి చాటి చెబుతుండటం చాలా గొప్పగా ఉందని, టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నృత్య కళాకారిణి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, రాగసుధా వింజమూరి చేసిన నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి అధ్యక్షతన సాగిన ఈ వేడుకలకు వ్యాఖ్యాతగా ఉపాధ్యక్షులు సత్య మూర్తి చిలుముల వ్యవహరించారు.