ISRO Sucessfully Docks Satellites: స్పేడెక్స్ ప్రయోగ విజయంతో 2024కు ఘనమైన ముగింపు పలికిన ఇస్రో ఈ ఏడాది ప్రారంభంంలోనే మరోసారి చరిత్ర సృష్టించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా వ్యామనౌకల అనుసంధాన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విజయంతో అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది.
చారిత్రాత్మక విజయంపై ఆనందాన్ని పంచుకున్న ఇస్రో: ఈ మేరకు రోదసిలో ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ విజయవంతమైనట్లు ఇస్రో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా పంచుకుంది. అంతరిక్ష చరిత్రలో భారత్ తన పేరును లిఖించుకుందని, ఈ చారిత్రాత్మక క్షణాన్ని చూసినందుకు చాలా గర్వంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేసింది.
SpaDeX Docking Update:
— ISRO (@isro) January 16, 2025
🌟Docking Success
Spacecraft docking successfully completed! A historic moment.
Let’s walk through the SpaDeX docking process:
Manoeuvre from 15m to 3m hold point completed. Docking initiated with precision, leading to successful spacecraft capture.…
ప్రధాని మోదీ హర్షం: స్పేడెక్స్ మిషల్లో ఉపగ్రహాల డాకింగ్ విజయవంతంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. రోదసిలో రెండు శాటిలైట్లను విజయవంతంగా అనుసంధానం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక బృందానికి అభినందనలు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాలకు ఇది ఒక కీలక మెట్టుగా నిలిచిందని పేర్కొన్నారు.
ఇస్రో స్పేడెక్స్ ప్రయోగం: కాగా ఇస్రో 30 డిసెంబర్ 2024న రాత్రి 10:00:15 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడెక్స్) ప్రయోగాన్ని చేపట్టింది. ఈ మిషన్‌లో శాస్త్రవేత్తలు PSLV-C60 ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు.
PSLV-C60 ఈ శాటిలైట్లను విజయవంతగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ స్పేడెక్స్ మిషన్ ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) రెండు ఉపగ్రహాలు రోదసిలో డాకింగ్, అన్‌డాకింగ్ నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా వృత్తాకార కక్ష్యలో ఈ జత ఉపగ్రహాలను ఏకకాలంలో డాకింగ్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
Dr. V. Narayanan, Secretary DOS, Chairman Space Commission and Chairman ISRO, congratulated the team ISRO.#SPADEX #ISRO pic.twitter.com/WlPL8GRzNu
— ISRO (@isro) January 16, 2025
రెండుసార్లు వాయిదా: ఇస్రో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ జనవరి 7న జరగాల్సి ఉంది. అయితే ఈ మిషన్‌లో సాంకేతిక కారణాలు తలెత్తడంతో డాకింగ్ ప్రక్రియపై మరికొంత పరిశోధన అవసరమని పేర్కొంటూ ఈ షెడ్యూల్‌ను జనవరి 9కి మార్చినట్లు మొదట ఇస్రో ప్రకటించింది.
ఆ తర్వాత కూడా ఇస్రో స్పేడెక్స్ మిషన్‌లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియను మరోసారి వాయిదా వేసింది. ఇస్రో రీషెడ్యూల్ చేసిన ప్రణాళిక ప్రకారం ఈ ప్రాసెస్ జనవరి 9, 2025 ఉదయం 8:00 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఉపగ్రహాల మధ్య దూరం ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండటంతో ఈ ప్రయోగాన్ని మరోసారి వాయిదా వేసినట్లు ఇస్రో ప్రకటించింది.
ఇస్రో రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 500 మీటర్ల నుంచి 225 మీటర్లకు చేర్చేందుకు ఓ విన్యాసం నిర్వహించింది. అయితే ఈ రెండు శాటిలైట్ల మధ్య దూరం ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండటాన్ని గుర్తించడంతో మరోసారి పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చిందని పేర్కొంటూ ఇస్రో తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. దీంతోపాటు ప్రస్తుతం ఉపగ్రహాలు సురక్షితంగా ఉన్నాయని వెల్లడించింది. అయితే రెండోసారి వాయిదా వేసిన సమయంలో మాత్రం ఇస్రో డాకింగ్ ప్రక్రియ రీషెడ్యూల్ తేదీని వెల్లడించలేదు.
SpaDeX Docking Update:
— ISRO (@isro) January 16, 2025
Post docking, control of two satellites as a single object is successful.
Undocking and power transfer checks to follow in coming days.
#SPADEX #ISRO
ఆదివారం అప్డేట్: రెండుసార్లు వాయిదా వేసిన అనంతరం ఇస్రో ఆదివారం అంటే జనవరి 12వ తేదీని దీనిపై ఓ అప్డేట్ అందించింది. రెండు స్పేడెక్స్ శాటిలైట్లు మరింత దగ్గరయ్యాయని వెల్లడించింది. శనివారం (జనవరి 11) వాటి మధ్య దూరం 230 మీటర్లుగా ఉండగా, ఆదివారం నాటికి ఆ దూరం మొదట 15 మీటర్లకు చేరుకుందని తెలిపింది. ఆ తర్వాత శాస్త్రవేత్తలు ఆ రెండు శాటిలైట్లను 3 మీటర్ల దగ్గరకు తీసుకువచ్చి అక్కడ వాటిని హోల్డ్ చేశారు. ఈ డేటాను పూర్తిగా విశ్లేషించిన తరువాత డాకింగ్ ప్రక్రియ చేపడతామని ఇస్రో తెలిపింది.
ప్రస్తుతానికి శాటిలైట్లలోని అన్ని వ్యవస్థలూ సక్రమంగానే పనిచేస్తున్నాయని, అన్ని సెన్సర్ల పనితీరును విశ్లేషిస్తున్నామని పేర్కొంటూ ట్వీట్ చేసింది. ఈ క్రమంలో అనుకున్నట్లుగానే భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో ఈ అనుసంధాన ప్రక్రియను విజయవంతగా పూర్తి చేసినట్లు ఇస్రో గురువారం ట్వీట్ పంచుకుంది.
స్పేడెక్స్ మిషన్ భవిష్యత్ ప్రయోగాలకు ఎలా ఉపయోగపడుతుందంటే?: అంతరిక్షంలో పెద్ద నిర్మాణాలను నిర్మించడానికి, ఉపగ్రహాల్లో ఇంధనం నింపి వాటి మెంటైనెన్స్ చూసుకోవడం కోసం, సపోర్టింగ్ శాంపుల్ రిటర్న్ మిషన్స్, అంతరిక్ష శిధిలాలను తగ్గించేందుకు ఈ డాకింగ్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. అంటే ఈ మిషన్ అంతరిక్ష అన్వేషణను మరింత సమర్థవంతంగా, స్థిరంగా చేస్తుంది.
సొంత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అభివృద్ధికి అవసరమైన డాకింగ్ సామర్థ్యాలతో స్పేడెక్స్ మిషన్ భారతదేశాన్ని సన్నద్ధం చేయడమే కాకుండా, ఇస్రో మరింత సంక్లిష్టమైన లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. ఇలా ఈ ప్రయోగం భవిష్యత్తులో మానవ అంతరిక్ష ప్రయాణ ప్రయత్నాలకు ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో లాంగ్- టెర్మ్ స్పేస్ ప్రాజెక్ట్‌ల కోసం దీన్ని తెలుసుకోవడం చాలా అవసరం.
సింపుల్‌గా చెప్పాలంటే జాబిల్లిపై వ్యోమగామిని దించడం, చంద్రుడి నుంచి మట్టిని తీసుకురావడం, సొంత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)ను నిర్మించాలన్న భారత్ కల సాకారం కావాలంటే వ్యోమ నౌకల డాకింగ్, అన్ డాకింగ్ ఎంతో అవసరం. ఈ నేపథ్యంలోనే ఇస్రో ఈ స్పేడెక్స్ ప్రయోగాన్ని చేపట్టింది.
ఏంటీ స్పేడెక్స్ మిషన్?: ఇస్రో చేపట్టిన ఈ స్పేడెక్స్ మిషన్ SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు చిన్న ఉపగ్రహాలను కలిగి ఉంటుంది. వీటిలో ఒక్కో శాటిలైట్ బరువు దాదాపు 220kg ఉంటుంది. ఈ జత ఉపగ్రహాలు భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార కక్ష్యలో తిరిగి, ఆ తర్వాత అత్యాధునిక సెన్సార్స్, అల్గారిథమ్‌లను ఉపయోగించి ఒకదానినొకటి గుర్తించి అనుసంధానం చేసేందుకు శాస్త్రవేత్తలు ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే ఇప్పుడు ఈ ప్రక్రియను పూర్తి చేశారు.
ఇప్పటి వరకు ఇలాంటి ఫీట్‌ను కొన్ని దేశాలు మాత్రమే చేయగలిగాయి. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ప్రస్తుతం సక్సెస్ కావడంతో అటానమస్ డాకింగ్ సామర్థ్యం ఉన్న అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల సరసన భారత్ చేరింది. ఈ ప్రయోగంతో ప్రపంచంలో ఇంత అధునాతన టెక్నాలజీని కలిగి ఉన్న నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే ఈ టెక్నాలజీని కలిగి ఉన్నాయి.
2025లో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?- ఇది ఏ రాశులపై ప్రభావం చూపిస్తుందంటే..?
సాంకేతికతలో విప్లవ మార్పులు- అంతరిక్షంలో 'పురుడు' పోసుకున్న జీవం!- ఇస్రో మరో ఘనత
సూర్యుని చెంతకు మానవ అస్త్రం- చరిత్ర సృష్టించిన 'పార్కర్ సోలార్ ప్రోబ్'
'విశ్వంలో డార్క్ ఎనర్జీ అనేదే లేదు- ఆ సిద్ధాంతాలు తప్పు'- వీడిన అతిపెద్ద మిస్టరీ!