Telangana Group-1 Prelims Exam Paper Analysis 2024 : తెలంగాణలో 563 గ్రూప్-1 సర్వీసుల పోస్టులకు ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 897 కేంద్రాల్లో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. పరీక్షకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేయగా. 3.02 లక్షల మంది (దాదాపు 74%) హాజరయ్యారని టీజీపీఎస్సీ వెల్లడించింది. పూర్తి వివరాల మదింపు తర్వాత హాజరు గణాంకాల్లో స్వల్ప మార్పులు ఉంటాయని తెలిపింది. త్వరలోనే కమిషన్ వెబ్‌సైట్లో ప్రాథమిక కీ పొందుపరుస్తామని, గ్రూప్-1 ప్రధాన పరీక్షలు అక్టోబర్ 21 నుంచి ప్రారంభమవుతాయని టీజీపీఎస్సీ పేర్కొంది.
TGPSC Group 1 Expected Cut Off 2024 : ప్రస్తుత ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం గతంలో రద్దైన రెండు ప్రశ్నపత్రాల కన్నా కొంత తేలికగా ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇందులో అన్ని రంగాల నుంచి ప్రశ్నలు వచ్చాయని తెలిపారు. ఓపెన్ కటాఫ్ మార్కులు 75 వరకు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర పథకాలు, తెలంగాణ వర్తమాన వ్యవహారాలు, రాష్ట్ర సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం, మహాలక్ష్మి కింద ఉచిత గ్యాస్ పథకాలపై ప్రశ్నలు వచ్చాయి. కొవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేసిన సంస్థ, ఎన్నికల సంఘం కమిషనర్లు, కేంద్ర ప్రభుత్వ చట్టాలు, జీ-20, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యంతర బడ్జెట్లపై ప్రశ్నలు అడిగారు.
50 శాతం మార్కులు దాటితే సేఫ్ జోన్ : ప్రస్తుత ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం రద్దైన గత రెండు పేపర్లతో పోల్చితే కొంత తేలికగా ఉందని సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత తెలిపారు. మొత్తం 150 ప్రశ్నల్లో 25 ప్రశ్నలు అర్థమెటిక్, లాజికల్, రీజనింగ్, క్వాంటిటేటివ్‌పై ఉన్నాయని చెప్పారు. ఇవి ఎక్కువ సమయం తీసుకునేలా అడిగారని పేర్కొన్నారు. మిగతా 125 ప్రశ్నలు జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించినవని అన్నారు. మొత్తానికి నాణ్యమైన ప్రశ్నలు వచ్చాయని బాలలత వెల్లడించారు.
పాలిటీలో ప్రశ్నలు తేలికగా ఉన్నప్పటికీ, కొంత ఆలోచించేలా అడిగారని బాలలత పేర్కొన్నారు. అనాలసిస్ కన్నా ఫ్యాక్చువల్ ప్రశ్నలు ఎక్కువ వచ్చాయని చెప్పారు. పరీక్షలో ఓపెన్ కటాఫ్ 70-75 వరకు ఉండే అవకాశముందన్నారు. రిజర్వ్‌డ్ వర్గాల వారీగా చూస్తే 65-75 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. మొత్తం మీద 150 మార్కుల్లో కనీసం 50 శాతం దాటితే సురక్షిత జోన్‌లో ఉన్నట్లుగా భావించి అభ్యర్థులు గ్రూప్-1 ప్రధాన పరీక్షలకు సన్నద్ధం కావచ్చని వివరించారు. పర్యావరణం, శాస్త్ర, సాంకేతిక, అంతర్జాతీయ సంబంధాలుఇలా అన్ని రంగాల నుంచి ప్రశ్నలు వచ్చాయని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, మహిళ, ట్రాన్స్‌జెండర్ వర్గాల చట్టాలు, సంక్షేమంపై పలు ప్రశ్నలున్నాయని బాలలత అన్నారు.
ప్రశ్నపత్రంలో సమతుల్యం : ప్రిలిమ్స్‌లో ప్రశ్నల ఎంపిక, కేటాయింపులో సమతుల్యం కనిపించిందని బ్రెయిన్‌ట్రీ డైరెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వ సర్వీసులకు వెళ్లే వారికి ఎలాంటి అర్హతలు ఉండాలో పరీక్షించేలా ప్రశ్నలు అడిగారన్నారు. కొన్ని సుదీర్ఘమైన ప్రశ్నలు వచ్చాయని, వీటిని చదవడంతోపాటు జవాబులు గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల ఏపీపీఎస్సీ ప్రశ్నపత్రంతో పోల్చితే, టీజీపీఎస్సీ ప్రశ్నపత్రంలో తేలిక, మధ్యస్తం, కాఠిన్యం ఇలా అన్ని ప్రశ్నలు ఉండేలా సమతుల్యం పాటించారని వివరించారు. కొన్ని ప్రశ్నలకు ఆలోచించి జవాబులు గుర్తించేలా ఉన్నాయని చెప్పారు. ఓపెన్ క్యాటగిరీలో 78 మార్కులు కటాఫ్‌గా ఉండే అవకాశాలున్నాయని గోపాలకృష్ణ వెల్లడించారు.