Telangana Head Constable Got President Gallantry Medal : పంద్రాగస్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ, పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పతకాలను బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1037 మందికి ఈ పతకాలను ప్రదానం చేయనున్నారు. ఇక, ఈసారి అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీసు పతకం ఒకరికి మాత్రమే వరించింది.
అది కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్‌ను ప్రకటించారు. రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్ యాదయ్యకు రావడంపై రాష్ట్ర డీజీపీ జితేందర్ హర్షం వ్యక్తం చేశారు. యాదయ్యను తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
ఇంతకీ ఎవరీ హెడ్‌కానిస్టేబుల్ చదువు యాదయ్య : తెలంగాణ పోలీసు శాఖలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్య 2022లో ఓ దొంగతనం కేసులో ధైర్యంగా వ్యవహరించారు. గొలుసు చోరీలు, ఆయుధాల డీలింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు దుండగులు ఇషాన్ నిరంజన్ నీలంనల్లి, రాహుల్‌ను సాహసోపేతంగా పట్టుకున్నారు. 2022 జులై 25న దొంగతనానికి పాల్పడుతుండగా యాదయ్య వీరిని అడ్డుకున్నారు. దీంతో దుండగులు ఆయనపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశారు. ఛాతీ పైభాగాన పలుమార్లు పొడిచారు. తీవ్ర రక్తస్రావం అయినప్పటీకీ ఆయన వారిని పట్టుకున్నారు. తీవ్ర గాయాల కారణంగా 17 రోజుల పాటు ఆయన ఆసుపత్రి పాలయ్యారు. దుండగులను బంధించే క్రమంలో ఆయన చూపిన ధైర్యసాహసాలకు గానూ ఈ ఏడాది అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పతకాన్ని ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాలకు పతకాలు : ఈ ఏడాది మొత్తం 1037 మందికి ఈ పతకాలు ప్రదానం చేయనున్నారు. ఇందులో 208 మందికి పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంటరీ, 75 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 624 మందికి పోలీసు విశిష్ఠ సేవా (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకాలను అందజేయనున్నారు. ఈ పురస్కారాల్లో తెలంగాణ నుంచి 21 మందికి, ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మందికి ఈ పతకాలు వరించనున్నాయి.
ఇందులో రాష్ట్రంలో ఒకరికి రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం, ఏడుగురికి మెడల్ ఫర్ గ్యాలంటరీ, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకం, 11 మందికి పోలీసు విశిష్ఠ సేవా పతకాలు ఇవ్వనున్నారు. ఇక, ఆంధ్రా నుంచి నలుగురికి మెడల్ ఫర్ గ్యాలంటరీ, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకం, 19 మందికి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు అందజేయనున్నారు.
259 మందితో హైడ్రా టీమ్! - ఎవరెవరు ఉన్నారంటే? - 259 MEMBERS DEPUTATION TO HYDRA