Solar Fencing Protection To crops In Telangana : పంటలు వేసి, అవి చేతికి వచ్చే సమయానికి కోతులు, అడవి పందుల కారణంగా చేతికి రాకుండా పోతున్నాయి. ఒకవేళ వాటిపై దాడికి దిగితే తిరిగి మీదకు వస్తున్నాయి. ఇదిలా ఉండగా వన్యప్రాణుల కారణంగా నష్టపోయిన పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పరిహారాలు చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో హిమాచల్‌బాటలో నడిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఆ రాష్ట్రం వన్యప్రాణుల నుంచి పొలాలను కాపాడుకోడానికి పాటిస్తున్న జాగ్రత్తలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
దక్కని పరిహారం : వన్యప్రాణుల కారణంగా తెలంగాణలో ప్రతి సంవత్సరం 5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలకు నష్టం జరుగుతోంది. మొక్కజొన్న, శనగ, వేరుశనగ, పత్తి, చెరకు, జొన్న, వరి, సోయాబీన్, పొద్దు తిరుగుడు, కందులు, పెసలు, కూరగాయల పంటలు, పండ్ల తోటలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. ఇలా జరిగే నష్టానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలోనూ పరిహారం దక్కడం లేదు.
కోతులు, అడవి పందులు గుంపులుగా వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిపైన దాడి చేస్తున్నాయి. వీటి కారణంగా గత పదేళ్లలో 40 మందికి పైగా మరణించారు. వందల మంది గాయపడ్డారు. బాధిత రైతులకు, కుటుంబాలకు పరిహారం అందడం లేదు. ఈ సమస్య ఇటీవల శాసనసభ, శాసనమండలి సమావేశాల్లోనూ చర్చకు వచ్చింది. మండల, జిల్లా పరిషత్ సమావేశాల్లోనూ ప్రజా ప్రతినిధులు ఎప్పటి నుంచో ప్రస్తావిస్తున్నారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల వ్యవసాయ, నాబార్డు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వానికి నివేదిక : హిమాచల్‌ప్రదేశ్‌లో అమలులో ఉన్న సౌర విద్యుత్ కంచెల విధానంపై చర్చ జరిగింది. ఆ రాష్ట్రంలో అధ్యయనం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇటీవల అధికారులు హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
ఒకసారి మాత్రమే పెట్టుబడి : హిమాచల్‌ప్రదేశ్‌లో నాబార్డు సాయంతో కోతులు, ఇతర అడవి జంతువులు బెడద నివారణకు 5 వేల గ్రామాల్లో పొలాల చుట్టూ సౌర విద్యుత్ కంచెలను ఏర్పాటు చేయించారు. ఇవి సత్ఫలితాలు ఇచ్చాయి. కంచెలు లేని సమయంలో ప్రతి సంవత్సరం 3.18 లక్షల ఎకరాల్లో పంటలు పాడై, రూ.229 కోట్ల మేరకు నష్టాలు వచ్చేవి. ఇప్పుడు అలాంటిది ఏదీ లేవు. విద్యుత్ కంచెతో పోలిస్తే సోలార్ కంచె ప్రమాదరహితమైంది. ముట్టుకోగానే సాధారణ షాక్‌తో వదిలిపెడుతుంది. తక్కువ ఖర్చుతో, త్వరితగతిన బిగించవచ్చు. ఒకసారి మాత్రమే పెట్టుబడి ఖర్చవుతుంది. సౌర విద్యుత్ ఉచితంగా లభిస్తుంది. సాధారణ రైతులూ సులభంగా నిర్వహించవచ్చు. ఈ వ్యవస్థలో 12 వోల్టుల ఉత్పత్తి సామర్థ్యమున్న సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీలు, ఎనర్జైజర్, ఎర్తింగ్ ఉంటాయి. బ్యాటరీలో ఇంధన నిలువ కారణంగా రాత్రిపూట కూడా ఇది పని చేస్తుంది. చొరబాట్లపై రైతులకు అలారం రూపంలో సమాచారం అందుతుంది.
ప్రభుత్వ రాయితీ : హిమాచల్ ప్రభుత్వం సోలార్ కంచెల ఏర్పాటుకు చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకుల నుంచి 50 శాతం రాయితీని ఇప్పించింది. గోవా ప్రభుత్వం రెండు వేల మీటర్ల వరకు ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం రాయితీ (ఒకరికైతే రూ.2 లక్షలు, సామూహికమైతే రూ.3 లక్షల వరకు గరిష్ఠం) అందిస్తోంది. మన రాష్ట్రంలో 1000 మీటర్లకు 50 శాతం రాయితీ (మీటరుకు రూ.201 గరిష్ఠం) చొప్పున సాయం అందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. నాబార్డు ద్వారా బ్యాంకుల నుంచి రుణసాయం ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తోంది.
వచ్చేది ఎండాకాలం - కరెంటు బిల్లు తడిసిపోద్ది - 50శాతం సబ్సిడీతో సోలార్ ప్యానెల్ తెచ్చుకోండిలా!
'త్రీ ఇన్ వన్ సైకిల్' - బాలుడి టాలెంట్‌కు సీఎం ఫిదా
మీ భూమిలో 'సౌర విద్యుత్'తో కాసులు పండించొచ్చు! - ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి