Postal Ballot Counting Process : సర్వీసు ఓటర్లు వినియోగించుకున్న బ్యాలెట్ పత్రాల ధ్రువీకరణ లెక్కింపు రిటర్నింగ్ అధికారి టేబుల్‌పైనే లెక్కిస్తారు. కౌంటింగ్ ప్రారంభమయ్యే సమయానికి ఎన్ని పోస్టల్ బ్యాలెట్లు వస్తాయో వాటిని మాత్రమే లెక్కిస్తారు. అభ్యర్థులు ఎలక్ట్రానికల్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీపీబీ) వారితో మాట్లాడి జూన్ 3వ తేదీలోగా బ్యాలెట్ రిటర్నింగ్ అధికారికి చేరేటట్లు చూసుకోవాలి. ముందు ఫారం 13సీలోని కవర్ తెరుస్తారు. తరువాత ఒకదాని తర్వాత ఒకటి లెక్కిస్తారు. కవరు బయట ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి అవసరమైన చెకింగ్ జరుగుతుంది. రిటర్నింగ్ అధికారి సొంతంగా ఆ కవరుపై సీరియల్ నెంబరు వేస్తారు. క్యూఆర్ కోడ్ చెకింగ్ వల్ల ఎటువంటి డూప్లికేట్ ఓట్లకు అవకాశం ఉండదు.
పోస్టల్ బ్యాలెట్ పత్రాల ధ్రువీకరణ- లెక్కింపు
పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు కోసం ప్రత్యేక టేబుల్ ఉంటుంది. ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపునకు ఒక అదనపు టేబుల్ ఏర్పాటు చేస్తారు. ఓటర్లు ఎన్నికల సంఘం అందజేసిన కవర్లు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. (వేరే కవర్లు ఉంటే ఆ పోస్టల్ బ్యాలెట్లు చెల్లనివిగా పరిగణిస్తారు)
- మొదటి కవరు-బీ పైన నియోజకవర్గం పేరు, ఎన్నికల అధికారి అడ్రస్, ఓటరు సంతకం ఉండాలి. (కవరు-బి పై ఓటరు సంతకం తప్పనిసరి కాదు)
- మొదటి కవరు-బీ (ఫారం 13సీ) తెరిచినప్పుడు, లోపల రెండు కవర్లు ఉండాలి. మొదటిది ఫారం 13ఏ ఓటరు డిక్లరేషన్, రెండవది కవరు-ఏ లో ఉన్న పోస్టల్ బ్యాలెట్ పేపర్ (ఫారం 138), ఫారం 13ఏ డిక్లరేషన్, ఫారం 138 (కవరు-ఏ) విడివిడిగా ఉండాలి. లేని పక్షంలో అది చెల్లుబాటు కాదు.
- కవరు-సిలో ఉన్న పోస్టల్ బ్యాలెట్ పేపర్ (ఫారం 138)ను తెరువబోయే ముందు రిటర్నింగ్ అధికారి 13ఏ (ఓటర్ డిక్లరేషన్ ఫారం) సరిచూసుకోవాలి.
1) కవరు ఏ లేకపోయినా,
2) ఫారం 13ఏ (ఓటరు డిక్లరేషన్) లేకపోయినా,
3) డిక్లరేషన్ మీద ఓటరు సంతకం లేకపోయినా,
4) డిక్లరేషన్ మీద పోస్టల్ బ్యాలెట్ క్రమసంఖ్య నమోదు చేయకపోయినా, ఒకవేళ క్రమ సంఖ్య నమోదు చేసినట్లయితే
ఆ క్రమ సంఖ్య ఫారం 138 (పోస్టల్ బ్యాలెట్ కవరు) మీద ఉన్న క్రమ సంఖ్య ఒకటే కాకపోయినా,
5) ఫారం 13ఏ డిక్లరేషన్ మీద గజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా, ఒకవేళ సంతకం ఉండి గజిటెడ్ అధికారి హోదా తెలియజేసే స్టాంప్ కానీ లేదా హెూదా తెలియజేసే విధంగా చేతితో రాసి కాని లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లనిదిగా పరిగణిస్తారు.
పోస్టల్ బ్యాలెట్ పరిశీలన
ఫారం 13ఏ డిక్లరేషన్లో అన్ని అంశాలు సరిగా ఉన్నట్లయితే, ఫారం 13బీ పోస్టల్ బ్యాలెట్ కలిగివున్న కవరు - ఏ ను పరిశీలించాలి.
ఈ క్రింది పేర్కొన అంశాల ఆధారంగా పోస్టల్ బ్యాలెట్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలున్నాయి.
1) ఫారం 13ఏ డిక్లరేషన్లో పేర్కొనబడిన బ్యాలెట్ పేపరు క్రమ సంఖ్య, ఫారం 138 పోస్టల్ బ్యాలెట్లో కలిగివున్న క్రమ సంఖ్య ఒకటే కానప్పుడు.
2) ఓటరు తమ ఓటుని నమోదు చేయకపోయినప్పుడు.
3) ఓటరు తమ ఓటుని ఒకరికంటే ఎక్కువ మందికి నమోదు చేసినప్పుడు.
4) సదరు బ్యాలెట్ పేపరు చిరిగిపోయి పూర్తిగా సమాచారం కనిపించకపోయినప్పుడు.
5) ఓటరు తమ ఓటుని ఎవరికి వేశారో పూర్తి సందిగ్ధంగా ఉన్నప్పుడు.
6) ఓటరును గుర్తించగలిగే విధంగా పోస్టల్ బ్యాలెట్‌పై ఏవైనా మార్కింగ్ చేయడం (లేదా) ఓటరు సంతకం చేయడం (లేదా) ఓటరు పేరు రాసినప్పుడు.
పోస్టల్ బ్యాలెట్ తిరస్కరించకూడని సందర్భాలు...
1) ప్రత్యేకంగా "X" కాకుండా వేరే గుర్తు ఉన్నా అనుమతించాలి.
2) ఒకటి కంటే ఎక్కువ గుర్తులు ఒకే అభ్యర్థికి చెందిన గడిలో రాసినా అనుమతించాలి.
ప్రతి బ్యాలెట్ పేపరులో నమోదు చేయబడిన అంశాలను రాజకీయ పక్షాల ప్రతినిధిగా ఉన్న జనరల్ ఏజెంట్ / అభ్యర్థికి విధిగా సంబంధిత ఎన్నికల అధికారి చూపించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
పైన పేర్కొన్న విధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన తరువాత రిజల్ట్ షీట్ (పారం-20) నందు నమోదు చేయాల్సి ఉంటుంది.