Tree falls on Couple in Cantonment Hospital : సికింద్రాబాద్ శివారు తూముకుంటకు చెందిన రవీందర్, సరళాదేవీ దంపతులు. సరళాదేవి బొల్లారంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు మోకాలి నొప్పి రావడంతో నిన్న చికిత్స కోసం కంటోన్మెంట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ మృత్యువు మాను రూపంలో మాటు వేసి రవీందర్‌ను బలితీసుకోగా భార్య సరళాదేవిని తీవ్ర గాయాలపాలు చేసింది.
చికిత్స కోసం వెళ్లిన వారిలో ఒకరు గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా మరొకరిని విధి కబళించివేసింది. దీంతో వారికి అదే చివరి ప్రయాణంగా మారిందంటూ బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కంటోన్మెంట్ ఆస్పత్రికి చేరుకునే క్రమంలో ఆస్పత్రి గేటు దాటి దంపతులిరువురూ ద్విచక్రవాహనంపై కాస్త ముందుకు వచ్చారు. అంతే పక్కనే ఉన్న చెట్టు కొమ్మ విరిగి భార్యాభర్తలపై పడింది.
'మోకాలి నొప్పి ఉందని కంటోన్మెంట్ ఆసుపత్రికి వచ్చారు. గేట్లోపలి రాగానే చెట్టు మీద పడింది. ఆయన భార్య ప్రభుత్వ టీచర్. చెట్టు ఆయన ఛాతీపై పడింది. దీంతో ఆయన మరణించాడు.' - రమేశ్, ప్రత్యక్ష సాక్షి
భర్త చనిపోయిన విషయం తెలియక : రవీందర్‌కు ఆ చెట్టుకొమ్మ ఛాతిలో బలంగా తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఆస్పత్రి లోపలికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హఠాత్తు పరిమాణంతో మృతుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది క్షణాల ముందు అదే చెట్టు కింద నుంచి వచ్చిన వారు ఈ ఘటనను చూసి వణికిపోయారు.
భర్త చనిపోయిన విషయం తెలియక ఆసుపత్రిలో ఆయన క్షేమ సమాచారాన్ని అడుగుతున్న సరళాదేవి పరిస్థితిని చూసి బంధువులు, తోటి ఉపాధ్యాయులు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్‌నాయక్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. రెండు వారాల క్రితమే కంటోన్మెంట్ ఆసుపత్రిలోని ప్రమాదకర వృక్షాలను నరికి వేయించినట్లు వైద్యులు ఆయనకు వివరించడం గమనార్హం.
'గత మూడు రోజుల నుంచి వర్షాలు పడ్డాయి. ఆ చెట్టు సడెన్‌గా ఆసుపత్రి లోపలకి వస్తున్న రవీందర్ ఛాతీ మీద పడింది. ఆయన స్పాట్లో చనిపోయారు. ఆయన భార్య సరళాదేవికి గాయాలయ్యాయి. రవీందర్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సరళాదేవికి ఎలాంటి ప్రమాదం లేదు'- రామకృష్ణ ఆర్.ఎం.ఓ, కంటోన్మెంట్ ఆస్పత్రి