Hydra Demolition Details in Hyderabad : అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా, ఆక్రమణదారుల నుంచి ఇప్పటి వరకు వంద ఎకరాలకుపైగా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అనధికారిక నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల స్థలాన్ని పరిరక్షించినట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
హైడ్రా గత రెండు నెలలుగా చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాల పనిపడుతున్న హైడ్రా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తోంది. రాంనగర్ మణెమ్మ గల్లీలో 3, గగన్ పహాడ్ అప్పా చెరువులో 14, అమీన్పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్ సున్నం చెరువులో 42, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు హైడ్రా వెల్లడించింది. అత్యధికంగా అమీన్పూర్లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువులో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా పేర్కొంది.
'హైడ్రా'కు ప్రత్యేక పోలీస్ సిబ్బంది : హైడ్రాకు ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ప్రత్యేక పోలీసు సిబ్బందిని సైతం కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులు ఆక్రమణల కూల్చివేత కోసం పనిచేయనున్నారు. ఈ సిబ్బంది కేటాయింపుతో ఆక్రమణల తొలగింపు చర్యలు మరింత వేగవంతం కానున్నాయి.
CM Revanth Warn to Invaders : మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం చెరువులు చెరపట్టిన వారికి చెరసాల తప్పదని ఘాటుగా ఇవాళ హెచ్చరించారు. కబ్జాదారులు ఎంత గొప్ప వ్యక్తులైనా వదిలిపేట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మూసీ ఆక్రమణదారుల్లో పేదలకు పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన శిక్షణ పొందిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం, ఈమేరకు ఆక్రమణలపై ఘాటుగా స్పందించారు.