Gruha Jyothi Zero Power bills Started Telangana : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఆరు గ్యారంటీల్లో(Congress Six Guarantees) ఒకటైన గృహజ్యోతి పథకం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద వినియోగదారులకు జీరో బిల్లుల జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. మీటర్ రీడర్లు ఇంటింటికీ వెళ్లి రీడింగ్‌ను తీసి 200 యూనిట్లలోపు బిల్లు వచ్చిన వినియోగదారులకు జీరో బిల్లులు అందజేస్తున్నారు.
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని తెల్లరేషన్ కార్డుతో, ఆధార్ కార్డు అనుసంధానం చేసుకున్న వారికి జీరో బిల్లులను అందిస్తున్నట్లు డిస్కంలు వెల్లడించాయి. నేటి నుంచి జీరో బిల్లులు అందజేస్తున్నట్లు మీటర్ రీడర్లు తెలిపారు. జీరో బిల్లులు రాని వారు తిరిగి జీహెచ్ఎంసీ(GHMC) సర్కిల్ కార్యాలయాల్లో, మండల కార్యాలయాల్లో, ప్రజావాణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని డిస్కంలు సూచించాయి. ప్రతి నెల 20వ తేదీ లోపు డిస్కంలకు గృహజ్యోతి రాయితీలను ప్రభుత్వం చెల్లించనుంది.
Congress Launch Gruha Jyothi Scheme : రాష్ట్రంలో గృహాజ్యోతి పథకానికి రూ.2418 కోట్లు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ (Free Power Scheme in Telangana) ప్రభుత్వం అందజేయనున్నట్లు ప్రకటించింది. గృహజ్యోతి పథకానికి కేటాయించిన నిధులను అమలు చేసేందుకు సత్వర చర్యలు చేపడుతున్నామని భట్టి విక్రమార్క గతంలో తెలిపారు.
ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 27న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో గృహజ్యోతి పథకానికి శ్రీకారం చుట్టారు. మార్చి 1వ తేదీనుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే వినియోగదారులకు ఇవాళ జీరో బిల్లులను అందజేశారు. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్కార్ సూచించింది. అలాగే, పట్టణాలు, నగరాల్లో ఇళ్లు అద్దెకు ఇచ్చిన యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.
ఫ్రీ కరెంట్‌కు రేషన్ కార్డే ప్రామాణికం - మార్గదర్శకాలు జారీ చేసిన సర్కార్
యజమానుల పేరున ఉన్న ఇంటి కనెక్షన్, అద్దెకు ఉండే వారి పేరు మీద మార్పు చెందదని, అద్దెకున్న వారిని అప్లికేషన్ చేసుకోవద్దని ఒత్తిడి చెయ్యాల్సిన అవసరం లేదని అన్నారు. వారికి రేషన్ కార్డు ఉండి, సగటుగా 200 యూనిట్ల వరకూ విద్యుత్ వినియోగిస్తే(Power Consumption) దరఖాస్తు చేసుకోనివ్వాలని సూచించారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ఉచిత విద్యుత్ కోసం మొత్తంగా 81.54 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
రూ.900 వరకు ఆదా : హైదరాబాద్ మహానగర పరిధిలో 49.50 లక్షల ఇళ్లకు కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 19.85 లక్షల మంది మాత్రమే పథకం కోసం అప్లై చేయగా, మ్యాపింగ్ ప్రక్రియ 11 లక్షల వరకే జరిగింది. కాగా, ఈ నెలలో జారీ అయిన జీరో కరెంట్ బిల్లుల ఆధారంగానే అర్హుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుతం విద్యుత్ ఛార్జీల ప్రకారం లెక్కిస్తే నెలలో కచ్చితంగా 200 యూనిట్లు వాడుకునే ఇంటికి దాదాపు రూ.900 వరకు ఆదా కానున్నట్లు తెలుస్తోంది.
'గృహజ్యోతి'కి ఆధార్ కార్డు తప్పనిసరి - ఇలా చేస్తేనే ఫ్రీ కరెంట్‌కు అర్హులు
రాష్ట్రంలో వారికి మాత్రమే ఫ్రీ కరెంట్! - ప్రభుత్వ మార్గదర్శకాలివే!!