Encroachment Of Pond Land In Jagtial : రాజులు పోయారు. రాజ్యాలూ పోయాయి. కానీ నాడు వారు నిర్మించిన చెరువులు మాత్రం జగిత్యాల పట్టణానికి తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాయి. అంతటి ఘనచరిత్ర కలిగిన చెరువులపై ఇప్పుడు కబ్జాదారుల కన్నుపడింది. జిల్లాకు ఆనుకుని ఉన్న మోతె చెరువు, కండ్లపల్లి, లింగం చెరువు, ధర్మసముద్రం, ముప్పాల చెరువు, చింతకుంట చెరువులు ఒకప్పటి మనుగడ కోల్పోతున్నాయి. కబ్జాదారుల కన్ను పడి సముద్రాలను తలపించే చెరువులు కాస్తా చిన్న నీటి కుంటల్లా తయారవుతున్నాయి. ఎక్కడ చూసినా వాటి చుట్టూ ఆక్రమణలే దర్శనమిస్తున్నాయి.
హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరించాలి : జగిత్యాల పట్టణానికి అతిచేరువలో ఉండే మోతె చెరువు వాగు ఆక్రమించడంతో కొలనులోకి నీళ్లు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కబ్జాదారులకు రాజకీయ అండదండలు ఉండటంతో పురపాలకశాఖ సైతం అనుమతులు ఇచ్చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఎఫ్‌టీఎల్ లెవల్‌లో నిర్మాణాలు ఆపాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని వాపోతున్నారు. హైదరాబాద్‌లో చెరువుల కబ్జాలపై కొరఢా ఝలిపిస్తున్న హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరించి ఆక్రమణలు తొలగించాలని వారు కోరుతున్నారు.
'జగిత్యాలలో ఓ ఆరు చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. హైడ్రా అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ చెరువులకు సంబంధించి ఎఫ్‌టీఎల్ హద్దులు వేస్తే ఆక్రమణలకు గురికాకుండా ఉండేందుకు అవకాశం ఉంది. గతంలో 90 ఎకరాల చెరువు ఆక్రమణలకు గురై 85 ఎకరాలకు వచ్చింది. అందువల్ల హైడ్రా అధికారులు చర్యలు తీసుకోవాలి' అని స్థానికులు కోరుతున్నారు.
జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న చెరువులను కాపాడాలంటే హైడ్రా ఒక్కటే మార్గమని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. హైడ్రాను జిల్లాలకూ విస్తరిస్తే ఎంతో మేలు జరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డిని కోరినట్లు తెలిపారు.
"జిల్లాలో చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. బఫర్ జోన్ పరిధిలో ఉన్న వాటినీ మట్టితో నింపేస్తున్నారు. మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్రమణలు కేవలం జంటనగరాలలోని చెరువులు , కుంటలకే పరిమితం కాకుండా జిల్లాల్లో కూడా జరుగుతున్నాయి. హైడ్రా పరిధిని రాష్ట్రమంతటా విస్తరింపచేస్తే మంచింది. అలా వీలుకానిచో తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకైనా సీఎం ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాం" - జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ