Adulterated Milk Units in Hyderabad : పాలు అనేవి పసిబిడ్డ నుంచి పండు ముసలి దాగా అందరూ తాగే పౌష్ఠికాహారం. ఉదయం లేవగానే టీ లేదా కాఫీ మొదలుకొని బ్రేక్ ఫాస్ట్, లంచ్, రాత్రి డిన్నర్ ఇలా ప్రతిదానిలోనూ పాలు, పాల పదార్థాలను వాడుతూనే ఉంటాం. చిన్న పిల్లలకు ఆ పాలనే మరిగించి పడతాం. ఏ తీపి వంటకమో చేయాలన్నా, ఏ శుభకార్యమైనా పాలనే ప్రధానంగా వాడతాం. కానీ అలాంటి పాలే ఇప్పుడు కల్తీగా మారుతున్నాయి. ప్రజల బలహీనతను ఆసరాగా తీసుకొని బ్రాండ్ల పేరుతో తక్కువ ధరలకే పాలను ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. ఇవి తాగిన జనాలు వేగంగా రోగాల బారిన పడుతున్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి 'కల్తీ'గాళ్లు ఎంతో మంది ఉన్నారు. బ్రాండ్ల పేరుతో పాలను ఎలా కల్తీ చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
కల్తీ పాల తయారీ ఎలా? : కల్తీ పాలను తయారు చేసేటప్పుడు ఎవరికీ అనుమానం రాకుండా అందులో వాసన, చిక్కదనం కోసం రసాయనాలు కలుపుతారు. వాసన కోసం కొంచెం పాల పొడిని వాడి, దానికి గ్లూకోజ్ ద్రావణం, చిరోటి రవ్వ, ఎసిడిక్ యాసిడ్, పామాయిల్, వనస్పతి వంటి పదార్థాలను మిక్స్ చేస్తున్నారు. ఇలా రోజూ రాజధాని, చుట్టు పక్కల జిల్లాలకు 5 వేల లీటర్ల వరకు నకిలీ పాలను సరఫరా చేస్తున్నారు. ఈ నకిలీ పాలను గజేందర్‌సింగ్ అనే వ్యాపారి కోహినూర్, శ్రీకృష్ణ బ్రాండ్లతో బేగంబజార్ కేంద్రంగా నగరంలోని పలు టీ స్టాళ్లు, 50 హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ హౌస్‌లకు సరఫరా చేస్తున్నాడు. పాలే కాకుండా పెరుగు, వెన్న, ఐస్‌క్రీం వంటి వాటిని కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలుసుకుని ఎస్వోటీ పోలీసులు అవాక్కయ్యారు. నిన్న స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ ASI మల్లేశ్ ఆధ్వర్యంలో తన సిబ్బందితో దాడి చేయడంతో ఈ కల్తీ బాగోతం బయటపడింది.
ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీతో పాటు ఇతర సహకార, ప్రైవేటు డెయిరీలు తరచూ అధికారులకు ఫిర్యాదు చేశాయి. ప్రసిద్ధ కంపెనీల పేరుతో ప్యాకెట్లు రూపొందించి నకిలీ పాలు, పాల పదార్థాలు విక్రయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నా, అధికారులు మాత్రం పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. విజయ డెయిరీ పేరుతో కొన్ని నకిలీ సంస్థలు పాల ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు ఐదారు సార్లు ఆ సంస్థ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో ఏ సంస్థలు అక్రమాలు చేస్తున్నాయో స్పష్టంగా చెప్పినా చర్యలు తీసుకోకపోవడంతో నకిలీ దందా యథేచ్ఛగా సాగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నకిలీ దందా హైదరాబాద్ నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో, రాజధాని చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లోనూ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌కు ప్రతి రోజు 30 లక్షల పాలు : గ్రేటర్ హైదరాబాద్‌లో నిత్యం దాదాపు 30 లక్షల లీటర్ల పాలు అవసరం. సుమారు కోటి మంది జనాభాకు సహకార డెయిరీలు దాదాపు 10 లక్షలు, ప్రైవేటు డెయిరీలు దాదాపు 18 నుంచి 19 లక్షల లీటర్లు అమ్ముతున్నాయి. ఈ నకిలీ దందా ప్రధానంగా మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాలో ఎక్కువగా సాగుతోందని విమర్శలు వస్తున్నాయి. రేకుల షెడ్లే నకిలీ పాల తయారీ కేంద్రాలకు యూనిట్లుగా ఏర్పాటు చేస్తున్నారు.
అలర్ట్ : మీరు తాగే పాలలో సబ్బు నీళ్లు, యూరియా గుళికలు! - కల్తీని ఇలా ఈజీగా కనిపెట్టండి