Srikalahasti Pathala Vinayaka Temple : తొలిపూజ అందుకునే గణనాధుడు స్వయంభువుగా వెలసిన క్షేత్రాలు అనేకం ఉన్నాయి. అందులో శ్రీకాళహస్తి కూడా ఒకటి. పంచ భూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన శ్రీకాళహస్తిలో పాతాళ వినాయకుని దర్శనం చేసుకోకుంటే యాత్ర అసంపూర్తి అవుతుంది. ఎంతో మహిమాన్వితమైన పాతాళ వినాయకుని ప్రశస్తి తెలుసుకుందాం.
కావ్యాలకెక్కిన పాతాళ వినాయకుడు
శ్రీకాళహస్తిలో వెలసిన పాతాళ వినాయకుడు స్వయంభువు. ఈ వినాయకుని గురించి ధూర్జటి కవి శ్రీ కాళహస్తి మహాత్మ్యంలో వివరించారు. అలాగే శ్రీనాథుడు రచించిన హరవిలాసంలో కూడా ఈ స్వామి ప్రస్తావన ఉంది.
పాతాళ వినాయకుని ఆవిర్భావం వెనుక ఉన్న గాథ
శ్రీకాళహస్తిలో నలభై అడుగుల లోతులో పాతాళ వినాయకుడు వెలిసి ఉండడం వెనుక ఓ గాథ ఉంది. పూర్వం అగస్త్య మహాముని శ్రీకాళహస్తీశ్వరుని దర్శించి ఈ ప్రాంతంలో ఓ జీవనది ఉంటే బాగుంటుందని పరమశివుని ప్రార్థించాడట. శివుని అనుగ్రహంతో అక్కడ సువర్ణముఖి నది పాయ ఏర్పడింది. కానీ అందులో నీరు లేవు. ఇందుకు కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించిన అగస్త్యునికి విఘ్నాధిపతి అయిన గణపతిని ప్రార్థించకుండా ఈ కార్యానికి పూనుకోవడం వల్లే ఇలా జరిగిందని అర్థం చేసుకొని గణపతిని ప్రార్థిస్తాడు.
పాతాళానికి చేరుకున్న గణపతి
అగస్త్యునికి ప్రార్థనకు సంతోషించిన గణపతి పాతాళ మార్గం ద్వారా అక్కడకు చేరుకుని అగస్త్యుని కోరికను నెరవేరుస్తాడు. ఆనాటి నుంచి సువర్ణముఖి నదీ జీవ నదిగా మారింది. అగస్త్యునికి దర్శనమిచ్చిన పాతాళంలోనే వినాయకుడు స్వయంభువుగా వెలుస్తాడు. అందుకే ఆయన పాతాళ వినాయకుడయ్యాడు.
ఆటంకాలు దూరం- విజయం ఖాయం!
చేసే పనిలో తరచుగా ఆటంకాలు ఎదురవుతూ ఇబ్బందులు పడే వారు పాతాళ వినాయకుని దర్శిస్తే ఆటంకాలు తొలగిపోయి స్వామి అనుగ్రహంతో విజయాలు సిద్ధిస్తాయని విశ్వాసం. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకునే ప్రతివారు పాతాళ వినాయకుని తప్పకుండా దర్శించుకోవాలి. మనం కూడా పాతాళ వినాయకుని దర్శించుకుందాం సకల విజయాలు పొందుదాం. ఓం శ్రీ గణాధిపతయే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.