Makara Jyothi 2025 Date And Time Sabarimala : మకర జ్యోతి అనేది ఏటా జనవరి 14న మకర సంక్రాంతి రోజున సాయంత్రం ఆకాశంలో కనిపించే దివ్యమైన కాంతిపుంజం! ఇది కేరళ రాష్ట్రంలోని శబరిమలకు ఎదురుగా ఉన్న కందమల శిఖరంపై కనిపిస్తుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు ఏటా 41 రోజులు ఉపవాస దీక్ష చేసి శబరిమలకు వెళ్తారు.
జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం
సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామియే తన భక్తులను ఆశీర్వదించడానికి మకర జ్యోతిగా దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం. శబరిమలలో సంక్రాంతి రోజున 'మకర జ్యోతి'ని వీక్షించటానికి వేలాది భక్తులు పోటెత్తుతారు. సంక్రాంతి రోజున సాయం సమయంలో కనిపించే మకరజ్యోతిని చూశాక అయ్యప్ప మాలధారులు దీక్ష విరమిస్తారు. ఈ సందర్భంగా మకరజ్యోతి విశేషాలను తెలుసుకుందాం.
మకరజ్యోతి ఏంటి? మకరవిళక్కు ఏంటి?
2011లో మకరజ్యోతి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కొంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సందర్భంగా అప్పటి వరకు లేని విధంగా మకరజ్యోతి విశ్వసనీయతపై సందేహాలు తలెత్తాయి. శబరిమల ఆలయం ప్రధానార్చకుడు చెప్పిన ప్రకారం మకరజ్యోతి మానవులు వెలిగించేది కాదు. అదొక దివ్య నక్షత్రం. మకర విళక్కు అంటే కొండపై నుంచి మూడుసార్లు కనిపించే దీపమని, పొన్నంబళమేడు పర్వతంపైన చేసే ఒక దీపారాధన అని తేలింది. అయితే హేతువాద సంస్థలు మాత్రం ఇందుకు అంగీకరించకుండా మకరజ్యోతి నిజం కాదని, అది దేవుడి మహిమ కాదని, ఈ జ్యోతి మానవులే వెలిగిస్తున్నారని వాదిస్తున్నారు.
జ్యోతి స్వరూపం
ఏది ఏమైనా సాక్షాత్తూ ఆ సుబ్రహ్మణ్యుని స్వరూపమే అయ్యప్ప స్వామి అని హిందువులు విశ్వసిస్తారు. స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యుడు జ్యోతి స్వరూపమని స్పష్టమవుతోంది. సుబ్రహ్మణ్యుడే అయ్యప్ప కాబట్టి మకర జ్యోతి రూపంలో దర్శనమిచ్చేది అయ్యప్ప స్వామియే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రామాయణంలోనూ శబరిమల ప్రస్తావన
పురాణాల ప్రకారం శబరిమల ఆలయాన్ని పరశురాముడు స్థాపించారన్నది విశ్వాసం. శబరిమల ప్రస్తావన రామాయణంలో కూడా ఉంది. రాముడు పంపాకు, శబరిమల వద్ద శబరి ఆశ్రమానికి వెళ్లినట్లు నమ్ముతారు. ప్రాచీన కాలంలో పొన్నంబళమేడు మీద ఒక ఆలయం ఉంది. ఆ ఆలయ శిథిలాలు 'శివలింగం' సహా ఇటీవలి కాలం వరకూ అక్కడ ఉన్నాయి. అక్కడ ఒక చెరువు కూడా ఉంది.
పొన్నంబళమేడు
పొన్నాంబళం అంటే స్వర్ణ దేవాలయం. మేడు అంటే పర్వతం. పొన్నంబళమేడు అనే మాట, ధర్మశాస్త అయ్యప్ప స్వామిగా అవతరించిన పురాణ కథలను వర్ణించే జానపదుల నుంచి వాడుకలోకి వచ్చింది.
వెల్లివిరిసే ఆధ్యాత్మిక భక్తి భావం
మకర సంక్రాంతి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపు ఆలయానికి ఈశాన్య దిశలో పర్వత శ్రేణులు నుంచి వెలుగులీనుతూ జ్యోతి రూపంలో దర్శనమిచ్చే కాంతి పుంజంగా అయ్యప్ప స్వరూపం చూడటానికి భక్తులు ఉదయం నుంచి నిరీక్షిస్తుంటారు. ఈ జ్యోతి దర్శనం చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుందని విశ్వాసం. అంటే మరుజన్మ లేకుండా భగవంతుని చేరుకోవడం అని అర్థం.
పులకింపజేసే మకరజ్యోతి దర్శనం
శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి ముందు పందాళం నుంచి తెచ్చిన తిరువాభరణాలు ఆలయ ప్రధానార్చకులు స్వామికి అలంకరిస్తారు. అనంతరం మూలమూర్తికి హారతిస్తారు. ఆ వెంటనే పొన్నంబళమేడు పర్వత శిఖరాల్లో కాంతులీనుతూ మకర జ్యోతి దర్శనమిస్తుంది. ఇవన్నీ ఏకకాలంలో జరుగుతాయి.
స్వామియే శరణమయ్యప్ప!
మకరజ్యోతి దర్శనం కాగానే మనసంతా నిండిన భక్తి భావంతో అయ్యప్ప దీక్షాధారులు "స్వామియే శరణమయ్యప్ప!" అంటూ చేసే శరణఘోషలతో శబరిగిరులు మారుమ్రోగుతాయి. ఆ అనుభూతిని స్వయంగా అనుభవించాల్సిందే కానీ, మాటలతో చెప్పేది కాదు. ప్రత్యక్షంగా మాలధారులు మకర జ్యోతిని దర్శించుకుంటే పరోక్షంగా లక్షలాది మంది ప్రజలు ప్రసార మాధ్యమాలలో మకరజ్యోతిని దర్శించుకుంటారు. రానున్న మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం చేద్దాం. అయ్యప్ప స్వామి అనుగ్రహానికి పాత్రులవుదాం.
స్వామియే శరణమయ్యప్ప!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.