Minister Sridhar Babu on TS Electricity : ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కాకుండానే ఎన్నికల కోడ్ వచ్చిందని, ప్రభుత్వానికి సహకరించాలని ప్రతిపక్షాలను కోరామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పరిపాలనలో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయని ఇవి సహజమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల్లోనే హామీలు అమలు చేశామని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట సభలో విద్యుత్ పోతే ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ పార్టీ ఆరోపణలు చేసిందని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఫీడర్, ట్రాన్స్‌ఫార్మర్ సమస్యలు వస్తాయన్నారు. 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో విద్యుత్ సమస్యలు పరిష్కరించలేదని ధ్వజమెత్తారు. కానీ తమ ప్రభుత్వంలో 30 నిమిషాల్లోనే అధికారులు విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు.
బీఆర్‌ఎస్ హయాంలో ఉన్న విద్యుత్ వ్యవస్థనే కొనసాగిస్తున్నాం : వారం రోజుల క్రితం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జనరేటర్ సమస్య వల్ల విద్యుత్ నిలిచిపోయిందని మంత్రి సమాధానం ఇచ్చారు. అదే బీఆర్‌ఎస్ హయాంలో ఇదే ఎంజీఎం ఆసుపత్రిలో 121 సార్లు విద్యుత్ అంతరాయం కలిగిందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ రంగంలో కొత్తగా ఏమీ చేయలేదని బీఆర్‌ఎస్ హయాంలో ఉన్న విద్యుత్ వ్యవస్థనే కొనసాగిస్తున్నామని వివరించారు. విద్యుత్ సమస్యలు తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని, మరక అంటిస్తే వెంటనే తుడిచేస్తామన్నారు. డిమాండ్‌కు తగినట్లు విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
పరిశ్రమలు ఎక్కడికి పోవడం లేదు : తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, ఉత్తమ్ కుమార్‌కు మంచి పేరు వస్తుందనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. పరిశ్రమలకు సంబంధించి కట్టుబడి ఉన్నామని, గత ప్రభుత్వంలో మంచి ఉంటే దాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమలు ఎక్కడికో పోతున్నాయని కేటీఆర్ అంటున్నారు, కానీ అవి ఎక్కడికి పోవట్లేదు కొత్తవి వస్తున్నాయని తెలిపారు. తమ పని తీరే తమ మాటలు అని అన్నారు. తమ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే అనేక పరిశ్రమలు ఎంవోయూలు చేసుకున్నాయన్నారు. కేయిన్స్ పరిశ్రమ ఎక్కడికీ పోలేదని, కేంద్రం ఇచ్చే రాయితీల కోసం ఎదురు చూస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు వివరణ ఇచ్చారు.
"మీరు గొప్పగా చెప్పిన బంగారు తెలంగాణ నిర్మాణం చేశారని గౌరవించి. మీ పరిపాలన అనుభవాలను మాతో షేర్ చేసుకొండి. మార్పు రావాలని కోరుకుని ప్రజలంతా మాకు అవకాశం ఇచ్చారు. దానిలో పాల్గొనమని అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలకు చెప్పాం. సూర్యాపేట సభలో విద్యుత్ పోతే ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆరోపణలు చేశారు. ఇప్పుడు విద్యుత్ సమస్య వస్తే 30 నిమిషాల్లోనే పరిష్కారం చేస్తున్నాం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జనరేటర్ సమస్య వల్ల విద్యుత్ నిలిచిపోయింది." - శ్రీధర్ బాబు, మంత్రి
పేపరులో పేరు కనిపించాలనే తపన మహేశ్వర్ రెడ్డిలో కనిపిస్తోంది : సివిల్ సప్లయ్ డిపార్టుమెంట్ ఇంత అప్పుల్లోకి కూరుకుపోవడానికి కేంద్రం కూడా ఒక కారణమని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. లీడర్ కావాలన్న కోరికతో కాంగ్రెస్ పార్టీపై మహేశ్ రెడ్డి లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకుడుగా మహేశ్వర్ రెడ్డికి ఇంత బుద్ధి వచ్చిందానని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ పార్టీలోకి వెళ్లగానే తప్పులు ఒప్పులుగా మారాయా అంటూ ప్రశ్నించారు. పేపర్‌లో పేరు వస్తే చాలు అని మహేశ్వర్ రెడ్డి అనుకుంటున్నారని విమర్శించారు.
గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం : శ్రీధర్ బాబు - Lok Sabha Election 2024