Free Solar Pump Sets for Telangana People : వరదలకు విద్యుత్ పంపిణీ వ్యవస్థ దెబ్బతిన్న చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సరఫరా ఆగిన ప్రాంతాల్లో తక్షణమే పునరుద్ధరించాలని సూచించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విద్యుత్‌శాఖపై సమీక్షించిన సీఎం, విద్యుత్ శాఖ రాబడి, డిస్కమ్స్ రెవెన్యూలోటు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడారు.
రైతులను సోలార్ విద్యుత్ వైపునకు ప్రోత్సహించేందుకు ఉచితంగా పంపుసెట్లను అందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. తనస్వగ్రామమైన కొండారెడ్డి పల్లెను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని అధికారులకు స్పష్టంచేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ బిజినెస్ హబ్‌గా మారబోతోందని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కరెంట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అందుకు వినియోగంలోలేని వివిధ శాఖల భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. ఐటీ, పరిశ్రమలశాఖతో సమన్వయం చేసుకొని కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
వంట గ్యాస్ బదులు సోలార్ సిలిండర్ : రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వంటగ్యాస్ బదులుగా సోలార్ సిలిండర్ విధానం ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చి వారిని సోలార్ సిలిండర్ల వ్యాపారం వైపు ప్రోత్సహించాలన్నారు. అటవీ భూముల్లోనూ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని సీఎం తెలిపారు. ఏటా 40 వేల మెగావాట్ల కరెంట్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు.
ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి దుబారాను తగ్గించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. ఓవర్‌లోడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఆదేశించిన సీఎం, ఒక్క నిమిషం సరఫరాకు అంతరాయం ఉండొద్దని స్పష్టం చేశారు. వినియోగదారులకు 24 గంటలపాటు నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నామన్న నమ్మకం కలిగించాలని సీఎం స్పష్టం చేశారు.
విద్యుత్ శాఖ మంత్రి భట్టి సమీక్ష : యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ క్రమంలో ఏ సమస్య వచ్చినా వెంటనే డిస్కం సీఎండీల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. విద్యుత్ పునరుద్ధరణ సమయంలో క్షేత్రస్థాయి సిబ్బంది భద్రతా చర్యలు తీసుకొని పని చేయాలని సూచించారు. ప్రతి వినియోగదారుడిపైన ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.
వరదల వల్ల విద్యుత్ సంస్థకు భారీ నష్టం ఏర్పడిందని, నష్టం అంచనాలని స్పష్టంగా నమోదు చేసి వేగంగా నివేదిక రూపొందించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. అలాగే వ్యవసాయం, ఇళ్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న కరెంట్‌కి ప్రస్తుత నెలకి రాయితీ పద్దు కింద రూ.958 కోట్లను డిస్కంలకు విడుదల చేస్తూ రాష్ట్ర ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జీరో బిల్లులు జనరేట్ కాలేదనే నెపంతో - పెండింగ్ బిల్లులు వసూలు చేయడం దుర్మార్గం : హరీశ్‌రావు