Amaravati Farmers Protest Completed 1500 Days : 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ మూడుముక్కలాటకు తెరతీశాక ఎగసిన అమరావతి ఉద్యమం మరో మైలురాయికి చేరింది. ప్రభుత్వ దాష్టీకాలు, దమనకాండను తట్టుకుని 15 వందల రోజులకు చేరింది. ప్రతిపక్ష నేతగా అమరావతిని ఆహ్వానించిన జగన్, అధికారంలోకొచ్చాక మాటతప్పి, మడమ తిప్పేశారు. అమరావతిపై అనుక్షణం విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు. అమరావతి నిర్మాణ పనుల్ని నిలిపివేసి విధ్వంసానికి తెరతీశారు.
అధికార పార్టీ నేతలతో అమరావతి శ్మశానమని, ఎడారి అని నోటికొచ్చినట్టు మాట్లాడించారు. అమరావతి నేల భారీ నిర్మాణాలకు పనికి రాదని, పునాదులకే బోలెడు ఖర్చవుతుందంటూ కట్టుకథలు చెప్పారు. ఎగువ నుంచి నీటి ప్రవాహాలు వస్తుంటే సకాలంలో ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తకుండా ఎగువన నీటి మట్టం పెంచి అమరావతిని ముంచేయాలని, అది రాజధాని నిర్మాణానికి పనికిరాదని చాటి చెప్పాలనీ కుట్ర పన్నారు. 2014లో రూపొందించిన పాఠ్య పుస్తకంలో సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద అమరావతి పాఠ్యాంశంగా ఉండగా ఆ పేరే గిట్టని జగన్ సర్కార్ దాన్ని సిలబస్ నుంచి తొలగించేసింది. ఉద్దండరాయనిపాలెంలో అమరావతికి అట్టహాసంగా శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని ఇప్పుడు పశువులు, గొర్రెలకు వదిలేసింది. జగన్ అంతలా రాజధానిపై పగ సాధిస్తున్నారు.
నమ్మకద్రోహానికి నాలుగేళ్లు - రాష్ట్ర అభివృద్ధిని తలకిందులు చేసిన నిర్ణయం
రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు జగన్ చెయ్యని దుర్మార్గం లేదు. వేల సంఖ్యలో పోలీసుల్ని రాజధాని గ్రామాల్లోకి దించారు. 144 సెక్షన్, పోలీసు చట్టంలోని సెక్షన్ 30 వంటివి ప్రయోగించి అష్టదిగ్బంధం చేశారు. ఉద్యమం తొలినాళ్లలో పోలీసులు పేట్రేగిపోయారు. ఇళ్లల్లోకి వెళ్లి అర్ధరాత్రి తనిఖీల పేరుతో భయభ్రాంతుల్ని చేశారు. గ్రామాల్లో కవాతులు చేసి అక్కడి ప్రజల్ని భయపెట్టారు. 2020 జనవరిలో విజయవాడ కనక దుర్గమ్మకు పొంగళ్లు సమర్పించి, తమ గోడు వెళ్లబోసుకునేందుకు వెళ్తున్న మహిళల్ని అడ్డుకుని లాఠీఛార్జ్ చేశారు. దానికి నిరసగా రాజధాని గ్రామాల్లో బంద్ పాటిస్తే మందడంలో దీక్ష చేస్తున్న మహిళలపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఒక గర్భిణిని పోలీసు అధికారి ఒకరు కాలితో తన్నడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.
హైకోర్టు జోక్యం చేసుకుని పోలీసుల్ని తీవ్రంగా మందలించడంతో గ్రామాలపై పోలీసుల ఉక్కు పిడికిలిని కొంత సడలించారు. 2020 జనవరి 20న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన రైతులు అడ్డంకుల్ని, అవరోధాల్ని దాటుకుని శాసనసభ సమీపానికి చేరుకోవడంతో పోలీసులు వారిపైనా లాఠీలు ఝళిపించారు. 2021 మార్చి 8న మహిళా దినోత్సవం రోజున విజయవాడ కనకదుర్గ గుడికి వెళుతున్న మహిళలపై పోలీసులు మరోసారి విరుచుకుపడ్డారు.
ఈ నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానంలో వారి దాష్టీకానికి నిదర్శనంగా నిలిచిన ఇలాంటి ఘటనలు అనేకం. సుమారు 3 వేల మంది రైతులు, మహిళలు, రైతు కూలీలు, ఉద్యమ మద్దతుదారులపై ప్రభుత్వం 720కిపైగా అక్రమ కేసులు నమోదు చేసింది. ఎన్నో కష్టనష్టాలు, ఆంక్షల్ని, బెదిరింపుల్ని, అక్రమ కేసుల్ని ఎదుర్కొంటూ రాజధాని రైతులు మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అసాధారణ బలం, బలగం కలిగిన ప్రభుత్వాన్ని ఢీకొట్టి నిలబడిన సాధారణ రైతులకు వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో పాటు తెలుగువారంతా మద్దతుగా నిలిచారు.
మూడు ముక్కలాటతో ప్రజారాజధాని నాశనం - జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు: లోకేశ్
3 రాజధానుల నిర్ణయం, ప్రభుత్వ దమనకాండతో మనస్థాపం చెంది అనేక మంది ఉద్యమకారులు, రైతులు, కూలీలు అశువులు బాశారు. రాజధానికి నిర్మాణానికి భూములిచ్చిన వారు వారి కల సాకారం కాకముందే కన్నుమూశారు. అమరావతి ఐకాస వివరాల ప్రకారం ఇప్పటి వరకు 250 మందికి పైగా చనిపోయారు.
ఉద్యమంపై వెనక్కితగ్గని అమరావతి రైతులపై కక్షసాధించేందుకు 2022 మేలోనే చెల్లించాల్సిన వార్షిక కౌలు ఇప్పటికీ ఇవ్వకుండా వారిని జగన్ సర్కారు ముప్పు తిప్పలు పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రాకపోయినా అమరావతిని వీలైనంత నాశనం చేసి వెళ్లిపోవాలన్న లక్ష్యంతో జగన్ పని చేస్తున్నారు. అమరావతి మాస్టర్‌ప్లాన్‌ను విచ్ఛిన్నం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. రాజధాని వెలుపల వివిధ ప్రాంతాలకు చెందిన 50 వేల మందికి రాజధానిలో సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఆర్-5 పేరుతో ప్రత్యేక జోన్ ఏర్పాటు చేశారు.
రాజధానిలో ఈ ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒక్క ఇటుక వెయ్యలేదు. సరికదా అక్కడి రహదారుల్ని తవ్వేసి మట్టి, రాళ్లు ఎత్తుకుపోతున్నా వాటి వెనుక వైసీపీ వాళ్ల హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నా కనీసం అడ్డుకునే ప్రయత్నం చెయ్యలేదు. అమరావతి పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగట్టేందుకు రైతులు 2021 నవంబరు 1న న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. వారికి దారి పొడవునా ప్రజల నుంచి విశేష స్పందన, మద్దతు వచ్చింది. దీన్ని చూసి తట్టుకోలేకపోయిన జగన్ పాదయాత్రకు అవరోధాలు సృష్టించేందుకు అనేక కుట్రలకు పాల్పడ్డారు.
పాదయాత్ర అమరావతిలో మొదలై తిరుపతి చేరేంత వరకు అడుగడుగునా ఆంక్షలు పెట్టారు. పాదయాత్ర చేస్తున్న రైతులపై అక్రమ కేసులను వైసీపీ ప్రభుత్వం పెట్టింది. రైతులకు ఆశ్రయమిచ్చిన వారిని వేధించింది. రాత్రి బస కోసం ముందుగానే రైతులు కల్యాణ మండపాలు బుక్ చేసుకుంటే, స్థానిక వైసీపీ నాయకులు వాటి యజమానులపై ఒత్తిడి తెచ్చి రద్దు చేయించారు. ఎక్కడా ఆశ్రయం దొరక్క రైతులు నడిరోడ్డుపై కూర్చుని భోజనాలు చేయాల్సిన దుస్థితిని కల్పించింది.
ప్రకాశం జిల్లాలో రైతులపై పోలీసులు వీరంగం చేసి, లాఠీఛార్జ్‌కి దిగడంతో పలువురు గాయపడ్డారు. ప్రజల అండతో ఆ పాదయాత్రను రైతులు విజయవంతంగా పూర్తి చేశారు. అమరావతి పరిరక్షణ ఉద్యమం వెయ్యో రోజుకి చేరిన సందర్భంగా 2022 సెప్టెంబరు 12 నుంచి రాజధాని రైతులు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈసారి దారి పొడవునా వైసీపీ నాయకులే వారికి అడ్డుతగిలారు. రాజధాని రైతులు తమ ప్రాంతానికి ఎలా వస్తారో చూస్తామంటూ ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, వైసీపీ నాయకులు బెదిరింపులకు దిగారు. అలాంటి పరిస్థితుల్లో రామచంద్రపురం వరకు యాత్ర చేసిన రైతులు ప్రతికూల పరిస్థితుల్లో దాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.
రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 2022 మార్చి 3న హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. అమరావతి నిర్మాణానికి, రాజధాని రైతులకు స్థలాలు అభివృద్ధి చేసి ఇచ్చేందుకు, రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు నిర్దిష్ట గడువు విధించింది. దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్లింది. ఆకేసు ఇంకా విచారణలో ఉండగానే ఏదో ఒక ముసుగులో రాజధానిని విశాఖకు తరలించేందుకు నిన్న మొన్నటి వరకు జగన్ ప్రభుత్వం ప్రయత్నించింది.
సీఎం క్యాంప్ కార్యాలయం, వివిధ శాఖల కార్యాలయాన్ని విశాఖకు దొడ్డిదారిన తరలించేందుకు కుట్ర చేసింది. క్యాంపు కార్యాలయం పేరిట రుషికొండపై పచ్చదనాన్ని విధ్వంసం చేసి 433 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసింది. దీనిపైనా రైతులు కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్నారు. రాజధాని కేసులపై ప్రముఖ న్యాయవాదుల్ని రంగంలోకి దించిన ప్రభుత్వం ప్రజాధనాన్ని కోట్లలో వారికి ఫీజుల రూపంలో చెల్లిస్తుంటే రాజధాని రైతులు ఎకరానికి ఇంతని చందాలు వేసుకుని న్యాయపోరాటం సాగిస్తున్నారు.
అమరావతిలో ఇల్లంటూ మోసం- ఇప్పుడు విశాఖ అంటున్నావ్! జగన్ తగిన మూల్యం చెల్లించుకుంటాడు: అమరావతి రైతులు