How to Make Sorakaya Pottu Pachadi: సొరకాయ.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే చాలా మంది దీనితో కూర, పచ్చడి, బజ్జీలు, స్వీట్.. అంటూ ఎన్నో విధాలుగా ట్రై చేస్తుంటారు. అయితే కేవలం సొరకాయతో మాత్రమే కాదు.. సొరకాయ పొట్టుతో కూడా అద్భుతమైన పచ్చడి చేసుకోవచ్చు. కేవలం నిమిషాల్లోనే దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా పచ్చడి, నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే మైమరచి పోవాల్సిందే. కేవలం అన్నంలోకి మాత్రమే కాదు.. ఇడ్లీ, దోశ, వడ అంటూ ఇలా టిఫెన్స్, చపాతీల్లోకి కూడా కాంబినేషన్‌గా తినవచ్చు. పైగా ఇది ప్రిపేర్ చేయడానికి ఎక్కువ పదార్థాలు అవసరమే లేదు. మరి, లేట్ చేయకుండా ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు :
- సొరకాయ పొట్టు - 1 కప్పు
- పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ధనియాలు - 1 టేబుల్ స్పూన్
- మినపప్పు - 1 టీ స్పూన్
- జీలకర్ర - అర టీ స్పూన్
- పచ్చిమిర్చి - తగినన్ని
- టమాటలు - 2
- పసుపు - పావు టీ స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 6
- నువ్వుల పొడి - 1 టేబుల్ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- చింతపండు - చిన్న నిమ్మకాయంత
తాలింపు కోసం:
- నూనె - 2 టేబుల్ స్పూన్
- ఎండు మిర్చి - 2
- పచ్చి శనగపప్పు - 1 టీస్పూన్
- మినపప్పు - 1 టీ స్పూన్
- ఆవాలు - అర టీ స్పూన్
- జీలకర్ర - 1 టీ స్పూన్
- కరివేపాకు -2 రెమ్మలు
తయారీ విధానం:
- ముందుగా ఓ లేత సొరకాయ పొట్టును తీసుకోవాలి. పొట్టును శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా పిండి ఓ పొడి క్లాత్ మీద వేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. అలాగే చింతపండును నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పల్లీలు వేసి వేయించుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఓ గిన్నెలోకి తీసుకుని చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టాలి.
- ఇప్పుడు అదే పాన్‌లో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఆ నూనెలోనే కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత పక్కన పెట్టి.. అదే పాన్‌లో ఆరబెట్టిన సొరకాయ పొట్టు వేసి మగ్గించుకోవాలి.
- సొరకాయ పొట్టు కొద్దిగా మగ్గిన తర్వాత టమాట ముక్కలు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. మిశ్రమం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి.
- సొరకాయ పొట్టు చల్లారిన తర్వాత మిక్సీజార్‌లోకి వేయించి పొట్టుతీసిన పల్లీలు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర మిశ్రమం, వేయించిన పచ్చిమిర్చి, సొరకాయ మిశ్రమం వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి నువ్వుల పొడి, నానబెట్టిన చింతపండు, రుచికి సరిపడా ఉప్పును వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు తాలింపు చేసుకోవాలి. అందుకోసం.. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి.
- ఆయిల్ హీటెక్కిన తర్వాత ఎండు మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
- ఆ తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అనంతరం మిక్సీ పట్టుకున్న సొరకాయ మిశ్రమం వేసి ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరంగా ఉండే టేస్టీ సొరకాయ పొట్టు పచ్చడి రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్‌గా ఉంటుంది.
చూస్తేనే నోరూరిపోయే "వంకాయ పచ్చడి" - ఈ కొలతలతో చేసుకున్నారంటే అద్భుతః అనాల్సిందే!
నోరూరించే "పొట్లకాయ పెరుగు పచ్చడి" - ఇలా చేసి పెట్టారంటే నచ్చని వారూ ఇష్టంగా తినడం పక్కా!
ఎప్పుడూ రొటీన్ పచ్చళ్లే కాదు - ఓసారి "అరటిపువ్వు చట్నీ" ట్రై చేయండి! - టేస్ట్ వేరే లెవల్ అంతే!