Kakarakaya Karam Podi in Telugu : కాకరకాయ అనగానే ఇంటిల్లిపాదీ అబ్బో చేదు అనేస్తారు. ఇక పిల్లలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీ ఇంట్లోనూ కాకరకాయ అంటే "నో" అంటున్నారా? అయితే, ఓసారి ఈ పద్ధతిలో "కాకరకాయ కారం" చేసి పెట్టండి. వద్దన్నోళ్లే లొట్టలేసుకుంటూ మరీ తింటారు. చేదు లేకుండా ఆ రుచి, పరిమళం అంత అమోఘంగా ఉంటాయి. అన్నంలోకే కాదు టిఫెన్స్లోకి అదుర్స్ అనిపిస్తుంది. పైగా ఈ కారాన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే సుమారు 2 నుంచి 3 నెలల పాటు నిల్వ ఉంటుంది! మరి, ఈ సూపర్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- కాకరకాయలు - పావుకిలో
- ఆయిల్ - 6 టేబుల్‌స్పూన్లు
- పల్లీలు - 2 టేబుల్‌స్పూన్లు
- కరివేపాకు - గుప్పెడు
- శనగపప్పు - 1 టేబుల్‌స్పూన్
- మినప్పప్పు - 1 టేబుల్‌స్పూన్
- ధనియాలు - 1 టేబుల్‌స్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఎండుకొబ్బరి ముక్కలు - 1 టేబుల్‌స్పూన్
- తెల్ల నువ్వులు - 2 టేబుల్‌స్పూన్లు
- చింతపండు - చిన్న నిమ్మకాయంత
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావుటీస్పూన్
- కారం - తగినంత
- వెల్లుల్లి గడ్డ - 1
ఆలూ, అరటి చిప్సే కాదు - ఇలా "కాకరకాయ చిప్స్" ట్రై చేయండి! - చేదు తక్కువ, రుచి ఎక్కువ!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి సన్నని రౌండ్ షేప్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి. ఒకవేళ మీకు గింజలు వద్దనుకుంటే వాటిని తొలగించుకోవచ్చు.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక కట్ చేసిన కాకరకాయ ముక్కలను వేసి బాగా వేయించుకోవాలి. అయితే, నిదానంగా వేయించుకుంటేనే కాకర ముక్కలు మాడకుండా మంచిగా ఫ్రై అవుతాయని గుర్తుంచుకోవాలి.
- కాకరకాయ ముక్కలు కాస్త గోల్డెన్ కలర్లోకి మారి, క్రిస్పీగా వేగాయనుకున్నాక వాటిని ఒక ఫ్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత అదే ఆయిల్లో పల్లీలను వేసి ఎర్రగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఆపై అదే నూనెలో కరివేపాకును వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఆ పాన్‌లో 1 టేబుల్‌స్పూన్ నూనె ఉంచి మిగతా కాగిన ఆయిల్‌ని గరిటెతో ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి.
- తర్వాత వేడయిన నూనెలో శనగపప్పు, మినప్పప్పుని వేసి లో ఫ్లేమ్ మీద ఎర్రగా వేయించుకోవాలి.
- అవి వేగాక ధనియాలు, జీలకర్ర, ఎండుకొబ్బరి ముక్కలు వేసి కొద్దిసేపు వేయించుకువాలి. అవీ వేగాక చివర్లో తెల్ల నువ్వులు, చింతపండు వేసి అన్నింటినీ మరికాసేపు బాగా వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
కొలెస్ట్రాల్‌ను కరిగించే "ఉలవల కారం పొడి" - వేడి వేడి అన్నంలోకి తింటే అమృతమే!
- ఇప్పుడు వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారాక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించిన పప్పుల మిశ్రమం, సగం వేయించిన పల్లీలు, ఉప్పు, పసుపు, కారం వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో వేయించుకున్న కాకర ముక్కలు, కాస్త కరివేపాకు వేసుకొని మరీ మెత్తని పౌడర్లా కాకుండా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఆపై దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే మిక్సీ జార్లో వెల్లుల్లి పాయలు, మిగిలిన పల్లీలు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత ఆ వెల్లుల్లి పేస్ట్‌ని ముందుగా గ్రైండ్ చేసుకున్న కాకరకాయ కారంలో వేసుకోవాలి. అలాగే మిగిలిన కరివేపాకుని వేసి మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "కాకరకాయ కారం" రెడీ!
- ఈ కారాన్ని బాగా ఆరిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు. కనీసం 2 నుంచి 3 నెలల పాటు నిల్వ ఉంటుంది!
చేదు లేకుండా కమ్మని "కాకరకాయ ఫ్రై" - ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు!