మీ శరీరంపై ఇలాంటి కణతులు ఉన్నాయా? - వీటితో క్యాన్సర్ ముప్పు తప్పదా! - Skin Tags Causes - SKIN TAGS CAUSES
Causes Of Skin Tags : కొంతమందికి చర్మం, మెడ, ఇంకా ఇతర శరీర భాగాల్లో ఇలాంటి కణతులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరి.. ఇవి ఏంటి? భవిష్యత్తులో క్యాన్సర్ కణతులుగా మారే ప్రమాదం ఉందా? వీటి నియంత్రణకు ఏం చేయాలి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Published : Aug 14, 2024, 11:36 AM IST
|Updated : Aug 14, 2024, 2:26 PM IST
How To Remove Skin Tags : స్కిన్ టాగ్స్.. వీటినే "పులిపిర్లు" అంటారు. గతంలో పులిపిర్లు ఎవరికో ఒకరికి కనిపించేవి. కానీ.. ఇప్పుడు చాలా మందిలో ఇవి కనిపిస్తున్నాయి. ముఖం, మెడ, చంకల భాగాల్లో మొలుస్తూ ఇబ్బంది పెడుతున్నాయి. అయితే.. భవిష్యత్తులో ఇవి క్యాన్సర్ కణతులుగా మారే అవకాశం ఉందని చాలా మంది భయపడుతుంటారు. మరి.. నిజంగానే పులిపిర్లు క్యాన్సర్ కణతులుగా మారతాయా? ఇవి ఎలా తగ్గుతాయి? అనే ప్రశ్నలకు హైదరాబాద్కు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ 'డాక్టర్ స్వప్న ప్రియ' సమాధానం చెబుతున్నారు. ఆ వివరాలు మీకోసం..
స్కిన్ టాగ్స్ క్యాన్సర్ (Healthdirect రిపోర్టు) మాదిరిగా ఎప్పటికీ మారవని స్వప్న చెబుతున్నారు. చర్మంపై పులిపిర్లు ఉన్నవారు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే.. శరీరంపై ఒకటి రెండు పులిపిర్లు పెద్దగా మారొచ్చని, అలాగే కొత్తవి కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కానీ.. ఇవి క్యాన్సర్ కణతులుగా మారే అవకాశం లేదని డాక్టర్ స్వప్న ప్రియ అంటున్నారు.
పులిపిర్లు రావడానికి కారణాలు ?
- వంశపారంపర్యంగా పులిపిర్లు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. మీ ఇంట్లో ఎవరికైనా పులిపిర్లు ఉంటే.. అది మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- ప్రస్తుత కాలంలో ఊబకాయంతో ఎక్కువమంది బాధపడుతున్నారు. వీరిలో కూడా పులిపిర్లు ఎక్కువగా వస్తాయి.
- అలాగే షుగర్ ఉన్నవారు క్రమంగా బరువు పెరుగుతున్నా కొద్దీ.. స్కిన్టాగ్స్ కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రీడయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్తో బాధపడే వారిలో పులిపిర్లు ఏర్పడతాయి.
ఇంటి చిట్కాలు పాటిస్తే పులిపిర్లు తగ్గుతాయా ?
కొంత మంది పులిపిర్లు తగ్గడానికి వివిధ రకాల క్రీమ్స్, ఇంటి చిట్కాలు పాటిస్తుంటారు. కానీ, ఇవేవీ శాశ్వతంగా పూర్తిగా పులిపిర్లను మాయం చేయలేవు. అయితే, కొంతమంది ఇవి తొడలపై, మెడ భాగంలో ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతుంటుంది. ముఖ్యంగా తొడల భాగంలో పులిపిర్లు ఉన్నప్పుడు నడిచేటప్పుడు చర్మం రాపిడికి గురవుతుంది. ఇలాంటి సందర్భంలో పులిపిర్లను తొలగించాల్సి ఉంటుందని డాక్టర్ స్వప్న ప్రియ అంటున్నారు.
ఎలాంటి నొప్పి లేకుండానే ?
కొంతమంది చర్మంపై పులిపిర్లు ఎక్కువగా ఉన్నవారు.. అవి తొలగించుకునే క్రమంలో నొప్పి కలుగుతుందని అలానే ఉండిపోతారు. కానీ, ఆధునిక వైద్యంలో కొన్ని రకాల క్రీమ్స్ రాసి ఎలాంటి నొప్పి లేకుండా వాటిని తొలగించే ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. వీటిని రేడియో ఫ్రిక్వెన్సీ, లెజర్, ఎలక్ట్రో కార్టియో అనే పద్ధతుల ద్వారా తొలగించవచ్చు. ఈ ట్రీట్మెంట్ ద్వారా చర్మంపై ఎలాంటి మచ్చలు, హోల్స్ పడడం జరగదని డాక్టర్ స్వప్న ప్రియ చెబుతున్నారు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
మీ శరీరంపై ఈ బొడిపెలు ఉన్నాయా? - ఏం జరుగుతుందో తెలుసుకోండి!
పులిపిర్లు ఇబ్బంది పెడుతున్నాయా? - ఈ సింపిల్ టిప్స్ పాటిస్తే నొప్పి లేకుండా మాయం!