Iranian Hackers Stolen Trump Campaign Info : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకొనేందుకు ఇరాన్ హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని ఇటీవల ఆ దేశ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( ఎఫ్‌బీఐ) అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో బహిర్గతం కాని అంశాలను ఇరాన్ హ్యాకర్లు దొంగలించి, అప్పుడు అధ్యక్ష రేసులో ఉన్న జో బైడెన్‌కు అందించేందుకు యత్నించినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు.
"అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో బహిర్గతం కాని అంశాలను ఇరాన్ హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఆ సారాంశాన్ని జో బైడెన్ ప్రచారంతో సంబంధాలు ఉన్న అధికారులకు అందించేందుకు ప్రయత్నించారు. అందుకోసం సదరు అధికారులకు ఈ-మెయిళ్లు పంపారు. ఇదే సమాచారాన్ని యూఎస్‌లోని పలు మీడియా సంస్థలకు అందించేందుకు ప్రయత్నించారు" అని అమెరికా ఇంటెలిజెన్స్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అధికారులు పేర్కొన్నారు. ఇంతకుముందు ప్రకటించినట్లుగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఉద్దేశంతోనే ఈ విధంగా చేసిందని తెలిపారు. అయితే హ్యాకర్లు పంపిన ఈ-మెయిళ్లకు బైడెన్ ప్రచార సిబ్బంది స్పందించలేదని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌తో పాటు పలు ఏజెన్సీలు సంయుక్తంగా ప్రకటించడం గమనార్హం.
యూఎస్ అధ్యక్ష ఎన్నికలు
ఇదిలా ఉండగా, నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. బైడన్ పోటీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్‌లు బరిలోకి దిగారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తుందని ఎఫ్‌బీఐ అనుమానిస్తోంది. ఇదే విషయాన్ని గతంలోనే ఎఫ్‌బీఐ అధికారులు పేర్కొన్నారు. ట్రంప్ ప్రచారం హ్యాక్ అవడానికి ఇరాన్ కారణమని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ పూర్తిగా ఖండించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు ఏ మాత్రం లేదని తెలిపింది. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది.
ట్రంప్ కోసం 12 గంటలు వెయిట్ - ఆహారం వెంటతెచ్చుకొని మరీ! - Donald Trump latest