Foods For Migraine : సాధారణంగా చాలా మందిలో పని ఒత్తిడి, అలసట, ఆందోళన, నిద్రలేమి వంటి కారణాల వల్ల తలనొప్పి ఇబ్బందిపెడుతుంటుంది. అయితే.. నార్మల్‌గా వచ్చే తలనొప్పి తొందరగానే తగ్గిపోతుంది. కానీ మైగ్రేన్ వచ్చిందంటే మాత్రం.. గంటల నుంచి రోజుల పాటు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఈ సమస్యకు పూర్తి చికిత్స లేకపోయినా.. ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మైగ్రేన్ నుంచి కొంత మేర ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, మైగ్రేన్(Migraine) తలనొప్పిని తగ్గించుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? పరిశోధనలు ఏం చెబుతున్నాయి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ముందుగా ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు ప్రముఖ డైటీషియన్ డాక్టర్ శ్రీలత. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ.. ప్రాసెసింగ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, అధిక చక్కెర, కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలకు, దూరంగా ఉండాలని చెబుతున్నారు. అలాగే.. రోజువారి వంటలలో వాడే నూనెల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ముఖ్యంగా లినోలెయిక్ యాసిడ్ అనే పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ తక్కువగా ఉండే నూనెలు వాడేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా.. మైగ్రేన్‌తో బాధపడేవారు ముఖ్యంగా కీటోజెనిక్ డైట్, మాడిఫైడ్ అట్కిన్స్ డైట్ అనేవి ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు డాక్టర్ శ్రీలత. ఎందుకంటే.. ఈ రెండు రకాల డైట్స్ ఫాలో అయిన వారిలో మైగ్రేన్ ఎటాక్స్ చాలా వరకు తగ్గినట్లు, కొంతమందిలో మొత్తం మైగ్రేన్ వానిష్ అయినట్లు పరిశోధనలు చెబుతున్నాయన్నారు.
కీటోజెనిక్ డైట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ శాతం ఉంటుంది. కార్బొహైడ్రేట్ కంటెంట్ తక్కువ. అలాగే.. ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ డైట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మంచి న్యూరోప్రొటెక్టివ్‌గా పనిచేస్తాయంటున్నారు డాక్టర్ శ్రీలత. ఎందుకంటే.. మైగ్రేన్ అనేది బ్రెయిన్ రిలేటివ్ ప్రాబ్లమ్ కాబట్టి ఈ డైట్‌ను ఫాలో అవ్వడం ద్వారా ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తూ మనకు మంచి సెరటోనిన్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంతగానో తోడ్పడుతుందంటున్నారు.
అంతేకాదు.. మైగ్రేన్‌తో బాధపడేవారు ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మైటోకాండ్రియల్ ఫంక్షన్ కూడా ఇంఫ్రూవ్ అవుతుంది. ఓవరాల్‌గా శరీరానికి హెల్తీ న్యూట్రియంట్స్ అనేవి లభించడంతో పాటు మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు. ఫలితంగా మైగ్రేన్ ఎటాక్, ఫ్రీక్వెన్సీ అనేది చాలా వరకు తగ్గుతుందంటున్నారు డాక్టర్ శ్రీలత. ఇదే విషయం పలు పరిశోధనల్లో కూడా వెల్లడైంది.
ఏం చేసినా మైగ్రేన్ తగ్గట్లేదా? - ఇలా చేస్తే నిమిషాల్లో ఏళ్ల నాటి బాధ నుంచి రిలీఫ్!
పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే?: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) చేపట్టిన ఓ అధ్యయనం ప్రకారం.. కూరగాయల ఆధారిత కొవ్వులు, నూనెలు అధికంగా ఉండే ఆహారం తీసుకున్న వారితో పోలిస్తే.. కొవ్వులు ఎక్కువగా ఉండే చేపలు, చేపల నూనెలు(National Institutes of Health రిపోర్టు) తరచుగా తీసుకున్న మైగ్రేన్ బాధితుల్లో నెలవారీ తలనొప్పి, నొప్పి తీవ్రత చాలా వరకు తగ్గినట్లు పరిశోధకులు కనుగొన్నారు.
ముఖ్యంగా లినోలెయిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే మొక్కజొన్న, సోయాబీన్ నూనెలతో పాటు కొన్ని గింజల నుంచి తీసిన నూనెలను ఆహారంలో తగ్గించుకోవాలని.. వీటికి బదులుగా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే.. సాల్మన్, మాకెరెల్, హెరింగ్, సార్‌డైన్ వంటి చేపలు, చేపల నూనెలు తీసుకోవడం ద్వారా మైగ్రేన్ తలనొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుందని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ ఫుడ్స్ తింటున్నారా? - అయితే మైగ్రేన్ ముప్పు పొంచి ఉన్నట్టే!