Children Learn Bad Habits From Parents : చిన్నపిల్లలు తల్లిదండ్రుల నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు. తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకుని వారు ఏం చేస్తే అదే పిల్లలు ఫాలో అవుతుంటారు. మంచి విషయాలే కాదు.. చెడు విషయాలకూ ఇది వర్తిస్తుందని చెబుతున్నారు. ఈ అలవాట్లు వారు మంచి పౌరులుగా ఎదగడానికి ఒక అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే.. పిల్లల ముందు తల్లిదండ్రులు మంచి నడవడికను అలవర్చుకోవాలని సూచిస్తున్నారు. మరి.. తల్లిదండ్రుల నుంచి పిల్లల నేర్చుకునే ఆ చెడు అలవాట్లు ఏంటో మీకు తెలుసా??
కోపం :
పిల్లల మనసులు చాలా సున్నితంగా ఉంటాయి. అయితే, ఇంట్లో దంపతులు ఆర్థిక సంబంధ విషయాల్లో గానీ లేదా మరే ఇతర విషయాల్లో పిల్లల ముందు అస్సలు గొడవపడకూడదు. తల్లిదండ్రులు ఒకరిపై ఒకరు కోపగించుకుని, దుర్భాషలాడుకోవడం వల్ల వారు కూడా అదే నేర్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, పిల్లల ముందు అసభ్యకరమైన భాషలో తిట్టుకోవడం చేయకండి. అనుకోకుండా ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు ఒకరికొకరు నిందించుకోకుండా, సామరస్యంగా పరిష్కార మార్గాలను వెతుక్కోవాలని సూచిస్తున్నారు.
అబద్ధాలాడటం :
పిల్లల మనసులో కపటం ఉండదు. అందుకే ఎవరైనా అడిగితే వారు జరిగింది జరిగినట్టు చెబుతారు. అయితే, మీరు ఫోన్ మాట్లాడుతూ ఇంట్లో ఉన్నా కూడా, లేదూ నేను లేను ఆఫీస్‌లో ఉన్నాను అంటూ అని ఎవరికైనా పిల్లల ముందు అబద్ధం చెబితే వారు కూడా అదే చేస్తారు. మొదట పిల్లలు అబద్ధాలాడటం తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, మీరు నిజాయితీగా ఉంటూ పిల్లలకు మంచి అలవాట్లను నేర్పించండి.
చెడు ప్రవర్తన :
పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అన్నీ గమనిస్తూ ఉంటారు. అయితే.. మీరు ఇంట్లో వాళ్లతో విసుకుగా, చిరాకుగా మాట్లాడితే వారు కూడా అదే నేర్చుకుంటారు. వారు మీ చెడు ప్రవర్తనను చూసి నేర్చుకునే ప్రమాదం ఉంది. కాబట్టి, అందరితో నవ్వుతూ సంతోషంగా ఉండండి.
పరిశుభ్రత :
పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లను నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. కానీ, ఒకవేళ మీరు వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో పిల్లల ముందు ఏవైనా పొరపాట్లు చేస్తే వారు కూడా అవే నేర్చుకుంటారు. కాబట్టి, మీరు పిల్లలకు ఆహారం తినే ముందు చేతుల కడుక్కోవాలని, రోజూ శుభ్రంగా స్నానం చేయమని చెప్పాలి.
కొట్టడం :
తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో మాటామాటా పెరిగే ఒకరిపై ఒకరు చేయి చేసుకుంటారు. అయితే, ఇలా పిల్లల ముందు పరస్పరం దాడి చేసుకోవడం వల్ల వారు కూడా ఇతరులను కొట్టడం నేర్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, పిల్లల ముందు దంపతులు చేయి చేసుకోవడం మంచిది కాదు.
ఇంకా :
- తల్లిదండ్రులలో ఎవరికైనా గోళ్లు కొరకడం అలవాటు ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారట.
- అలాగే తల్లిదండ్రులు ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను ఎక్కువగా ఉపయోగిస్తే పిల్లలు కూడా వాటికే అతుక్కుపోయే ప్రమాదం ఉంది.
- కాబట్టి, పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వారితో ప్రేమగా మాట్లాడండి. ఎక్కువగా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు వాడకండి.
- చివరిగా తల్లిదండ్రులు ఎంత మంచి అరోగ్యకరమైన ఆహారాన్ని తింటే పిల్లల కూడా అవే తినడం అలవాటు చేసుకుంటారు.
- కాబట్టి ఉప్పు, ఫ్యాట్ ఎక్కువగా ఉండే జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ వంటి ఆహార పదార్థాలకు మొదట తల్లిదండ్రులు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
మీ పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలా? - పేరెంట్స్‌గా మీరు ఇవి పాటించాల్సిందే!