Dosa And Idli Batter Fermenting Tips in Winter : చాలా మంది ఎక్కువగా ఇష్టపడే రెసిపీలలో దోశ, ఇడ్లీ ముందు వరుసలో ఉంటాయి. అయితే, వీటిని ప్రిపేర్ చేసుకోవాలంటే పిండి చక్కగా పులవడం చాలా అవసరం. పిండి ఎంత బాగా పులిస్తే టిఫెన్స్ అంత మంచిగా వస్తాయి. అదే.. పిండి సరిగ్గా పులియకపోతే దోశ, ఇడ్లీలు గట్టిగా రాళ్లలా వస్తుంటాయి. ముఖ్యంగా చలికాలంలో పిండి ఎక్కువగా పులవదు. అయితే, కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా వింటర్ సీజన్లోనూ ఇడ్లీ, దోశ పిండి చక్కగా పులుస్తుందని చెబుతున్నారు నిపుణులు. మరి, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సరైన మోతాదులో తీసుకోవాలి : ముందుగా ఇడ్లీ, దోశ పర్ఫెక్ట్గా రావాలంటే పిండిని సరిగా ప్రిపేర్ చేసుకోవడం చాలా అవసరం. అంటే.. పిండి తయారీ కోసం నానబెట్టుకునే ఇడ్లీ రవ్వ, మినప్పప్పు, దోశకి బియ్యం వంటివి ఎంత పరిమాణానికి ఎంత మోతాదులో తీసుకోవాలో తెలిసుండాలి. అలాకాకుండా ఎక్కువైనా, తక్కువైనా పిండి సరిగా పులియదు. దాంతో దోశ, ఇడ్లీలు చక్కగా రావు. కాబట్టి.. ఇంగ్రీడియంట్స్ సరైన మోతాదులో తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.
మెంతులు, మరమరాలు : చలికాలం దోశ, ఇడ్లీ పిండి సరిగా పులియాలంటే.. అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నానబెట్టేటప్పుడు ఒక టీస్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టుకోండి. అలాగే దూదిలా ఉండే కొన్ని మరమరాలూ కలపండి. ఫలితంగా పిండి బాగా పులియడమే కాకుండా ఇడ్లీలు, దోశలు చక్కగా వస్తాయంటున్నారు నిపుణులు.
ఇలా మిక్సీ పట్టుకోండి : చాలా మంది పిండి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ యాడ్ చేస్తుంటారు. అయితే, వింటర్లో పిండి పట్టుకునేటప్పుడు మరీ వేడి నీరు కాకుండా కాస్త గోరువెచ్చగా ఉండే నీటిని తగినన్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా కూడా పిండి త్వరగా పులుస్తుందట.
పిండిని ఆ ప్రాంతంలో ఉంచండి : పిండి త్వరగా పులియాలంటే వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉంచాలి. అంటే స్టౌ దగ్గర పెట్టడం మంచి పనిగా చెప్పుకోవచ్చు. అలాగే పిండి పులియడానికి ఎక్కువ సమయం వదిలేయాలి. అదేవిధంగా పిండిని ఉంచే బౌల్స్ ఎలాంటి గ్యాప్స్ లేకుండా కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కూడా పిండి చక్కగా పులుస్తుందంటున్నారు.
స్టీమింగ్ పద్ధతి : ఈ టెక్నిక్ మరీ ఎక్కువగా చల్లగా ఉన్నప్పుడు పిండి త్వరగా పులియడానికి మంచిగా యూజ్ అవుతుంది. అదేంటంటే.. ఒక గిన్నెలో మరిగిన నీరు తీసుకొని అందులో మిక్సీ పట్టిని పిండి ఉన్న గిన్నెను ఉంచి దాన్ని కప్‌బోర్డ్‌లో పెట్టి రాత్రంతా అలానే ఉంచాలి. దీని ద్వారా పిండి మంచిగా పులుస్తుంది. అలాగే కాసేపు పిండిని మైక్రోవేవ్‌లో ఉంచినా చక్కగా పులుస్తుందంటున్నారు నిపుణులు.
ఇవీ చదవండి :
ఇడ్లీ/దోశ పిండి బాగా పులిసిపోయిందని పారేస్తున్నారా ? - ఇలా చేస్తే తాజాగా మారిపోతుంది!