Rahul Gandhi Speech In Lok Sabha : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం లోక్‌సభలో చేసిన ప్రసంగం తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు ఎదురుకావడం వల్ల రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. దీనిపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్, మంగళవారం లోక్‌సభ స్పీకర్‌కు ఓ లేఖ రాశారు. ఈ చర్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య నిబంధనలకు విరుద్ధమని రాహుల్ ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని ప్రస్తావించిన రాహుల్, ఆయన ఎన్ని ఆరోపణలు చేసినా ఒక్క పదాన్ని కూడా తొలగించలేదని గుర్తు చేశారు. ఇలా ఎంపిక చేసిన వ్యాఖ్యలను తొలగించడం సరికాదని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని కోరారు.
Lok Sabha LoP and Congress MP Rahul Gandhi writes to Speaker Om Birla over the remarks and portions from his speech expunged; requests that the remarks be restored.
— ANI (@ANI) July 2, 2024
The letter reads, " ...shocked to note the manner in which considerable portion of my speech have been simply… pic.twitter.com/zoD8A0xvlc
"సభా కార్యకలపాల నుంచి అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించే అధికారం సభాపతికి ఉంటుంది. అయితే, లోక్‌సభ నిబంధనల ప్రకారం రూల్ 380 కింద వచ్చే పదాలను మాత్రమే తొలగించే హక్కు ఉంటుంది. కానీ, నేను చేసిన ప్రసంగంలో రూల్ 380 కిందకు వచ్చే పదాలను ఉపయోగించలేదు. అయినా సరే నా ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను తొలగించడాన్ని చూసి షాక్‌కు గురయ్యాను. నేను వాస్తవ పరిస్థితులు, నిజాలను మాత్రమే సభలో చెప్పాను. ఆర్టికల్ 105(1) ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన హక్కు మేరకు ప్రతి ఒక్క సభ్యుడు ప్రజల గొంతును సభలో వినిపించాలి. ఇది ప్రతి ఒక్క సభ్యుడి హక్కు, దానినే నేను నిర్వర్తించాను."
--స్పీకర్‌కు రాసిన లేఖలో రాహుల్ గాంధీ
మరోవైపు పార్లమెంట్ సమావేశాలకు వెళ్లే ముందు ఈ అంశంపై స్పందించారు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ తన ప్రపంచంలోని నిజాలను తొలగించగలరు కానీ, వాస్తవ ప్రపంచంలో కాదని చెప్పారు. తాను ఏం చెప్పినా అది పూర్తిగా నిజమని స్పష్టం చేశారు. వారు ఎంత కావాలనుకుంటే అంత తొలిగించుకోవచ్చని కానీ సత్యమే గెలుస్తుందన్నారు.
రాహుల్‌పై స్పీకర్‌కు నోటీసు
మరోవైపు రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు బీజేపీ ఎంపీ భాన్సురి స్వరాజ్. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే రూల్ 115 ప్రకారం రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
The notice states, " the abovementioned statements made by lop in the lok sabha are factually incorrect and misleading in nature and hence appropriate proceedings ought to be initiated as provided under rule 115. i therefore pray that you kindly take cognizance of the deliberate… https://t.co/5sPO1qrm2e
— ANI (@ANI) July 2, 2024
రాహుల్ వ్యాఖ్యలను తొలగించిన స్పీకర్
అంతకుముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సోమవారం లోక్‌సభలో చేసిన ప్రసంగంలో కొన్ని పదాలను స్పీకర్ రికార్డులను నుంచి తొలగించారు. అధికారపక్షం అభ్యంతరాలతో హిందూమతాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సహా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, అగ్నివీర్, మోదీ, నీట్ పరీక్షల్లో అక్రమాలపై ప్రతిపక్ష నేత అన్న మాటలను తొలగిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది.
సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ సందర్భంగా హిందుత్వ అంశంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో పెను దుమారానికి దారితీశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేచి రాహుల్ ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలోనే సభలో కొన్ని మతపరమైన ఫొటోలను రాహుల్ చూపించారు. దీనిపై అధికారపక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించవని స్పీకర్ ఓం బిర్లా వారించారు. అనంతరం అగ్నివీర్ అంశంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా అభ్యంతరం వ్యక్తంచేశారు. వీటిపై రాహుల్ క్షమాపణ చెప్పాలని కూడా అధికారపక్షం డిమాండ్ చేసింది. అధికార పక్షం అభ్యంతరాలతో రాహుల్ సోమవారం చేసిన ప్రసంగంలో కొన్ని అంశాలు తొలగిస్తూ స్పీకర్ ఆదేశాలు జారీచేశారు.