Jharkhand Train Incident : ఝార్ఖండ్‌లో తాము ప్రయాణిస్తున్న రైలులో మంటలు చెలరేగాయంటూ వచ్చిన వదంతులు నమ్మి అందులో ఉన్న కొందరు ప్రయాణికులు దూకేసి భయంతో పరుగులు తీశారు. అదే సమయంలో అటు నుంచి వస్తున్న గూడ్స్ రైలు ఢీకొని వారిలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాంచీ- సాసారం ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో మంటలు వ్యాపించాయంటూ విపరీతంగా వదంతులు రేగాయి. దీంతో కొందరు చైన్ లాగి ట్రైన్ ఆగేలా చేశారు. ఆ తర్వాత కుమండీహ్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి దిగిపోయారు. పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై నిల్చున్నారు. అదే సమయంలో దూసుకొచ్చిన గూడ్స్ రైలు వారిని బలంగా ఢీకొంది. దీంతో ముగ్గురు చనిపోయారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
"రైలు చివరి బోగీలో ఉన్న కొందరు ప్రయాణికులు మంటలు చెలరేగుతున్నాయని అరిచారు. అది విని ట్రైన్ ఆపి కొందరు కిందకు దిగి చూడగా ఎలాంటి మంటలు లేవు. అప్పుడు గూడ్స్ ఢీకొని కొందరు చనిపోయారు"
- సునీల్ కుమార్, ప్రయాణికుడు
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులతోపాటు అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. వదంతులు వ్యాపించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు.
పట్టాలు దాటుతుండగా!
మరోవైపు, అదే రాష్ట్రంలో పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మరణించారు. తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు మృతదేహాలను శవపరీక్షల కోసం స్థానిక ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
జిల్లాలోని జంషెద్‌పుర్ పరిధికి చెందిన గోవింద్‌పూర్ హాల్ట్ స్టేషన్ సమీపంలో రెండేళ్ల బాలుడు, మూడేళ్ల బాలికతోపాటు పట్టాలు దాటుతున్న మరో వ్యక్తిని గూడ్స్ రైలు ఢీకొంది. దీంతో వారంతా రైలు చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మరణించారు. వారు ముగ్గురు జిల్లాలోని పొట్కా బ్లాక్ నివాసితులై ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్థరించారు. వారిని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తామని తెలిపారు.