పురాతన మెట్ల బావులకు మహర్దశ - పునరుద్ధరణకు భారత్ బయోటెక్ సాయం
Published : Sep 28, 2024, 8:36 PM IST
|Updated : Sep 28, 2024, 9:32 PM IST
Bharat Biotech to Restore Stepwells In Telangana : హైదరాబాద్ అమ్మపల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంతో పాటు సాలార్ జంగ్ మ్యూజియంలోని చారిత్రక మెట్లబావులు పునరుద్ధరిస్తామని భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది. నీటి సంరక్షణతో పాటు పర్యావరణ, వారసత్వ పర్యాటకం పెంపు, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడం, జీవనోపాధి మెరుగుపర్చే లక్ష్యంతో మెట్ల బావుల పునరుద్ధరణ చేపట్టినట్లు భారత్ బయోటెక్ సంస్థ పేర్కొంది. ఈ మేరకు సీఐఐ, సొసైటీ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్తో ఒప్పందం చేసుకున్నట్టు భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఘనమైన చారిత్రక వారసత్వాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు సుస్థిర నీటి నిర్వహణను ప్రోత్సహించడంలో భాగంగా పురాతనమైన మెట్లబావులను పునరుద్ధరించి తమ వంతు సహకారం అందించనున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ జేఎండీ సుచిత్ర ఎల్లా తెలిపారు.