Telangana Government on Education Achievements : రాష్ట్రంలో ఒక్క ఏడాదిలోపే విద్యారంగంలో ఎన్నో విజయాలను సాధించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే విద్యారంగాన్ని పట్టిపీడిస్తున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపినట్లు పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్దే విద్యాశాఖను ఉంచుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తొలి సంవత్సరం విద్యారంగ అభివృద్ధి - ప్రభుత్వ ప్రాధాన్యత పేరుతో నివేదికను తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఇందులో గత 11 నెలల్లో విద్యారంగంలో సాధించిన విజయాలను పొందుపరిచారు.
ముఖ్యాంశాలు ఇవే
- స్కూళ్లల్లో పారిశుద్ధ్య కార్మికులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ద్వారా సీఎస్‌ఆర్ నిధుల కింద రూ.136 కోట్లను సమకూర్చింది. దీంతో ఆ నిధులతో బడుల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమించుకున్నారు.
- విద్యార్థుల ఏకరూప దుస్తులు కుట్టు ధరను రూ.50 నుంచి రూ.75కు పెంచగా, పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
- సుమారు దశాబ్దం తర్వాత 21,419 మంది టీచర్లకు పదోన్నతులు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, ఏళ్ల తరబడి ఒకేచోట పని చేస్తున్న 34,706 మందిని బదిలీ చేసింది. 2013 నుంచి మోడల్ స్కూళ్లలోనూ బదిలీల కోసం ఎదురుచూస్తున్న 2,757 మందికి స్థానచలనం చేసింది. అంతేకాకుండా 8,630 మంది భాషా పండితులు, 1849 మంది పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించింది.
- 2017 తర్వాత 11,602 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం 65 రోజుల్లోనే నియామకాలు పూర్తి చేసింది. మరో డీఎస్సీని ఇచ్చేందుకు తాజాగా టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ప్రతి 6 నెలలకోసారి టెట్ నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇన్‌ఛార్జి ఎంఈవోల నియామకం చేపట్టింది.
- టెన్త్ క్లాస్‌లోని సైన్లో భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరు ప్రశ్నపత్రాలుంటాయి. వాటిన ఇప్పటివరకు ఒకే రోజులో నిర్వహిస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారు. ఈ నేపథ్యంలో సైన్ పరీక్షలను ఈ సారి రెండు రోజులుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- గతంలో పాఠశాలలను ఉన్నతీకరించినా టీచర్లు పోస్టులు మాత్రం మంజూరు చేయలేదు. ఈ క్రమంలో అవసరం లేనిచోట నుంచి దాదాపు 900 పోస్టులను అప్‌గ్రేడ్ అయిన స్కూళ్లకు కేటాయింపు చేసింది.
- ఇంటర్, కళాశాల, సాంకేతిక విద్యాశాఖలో పలు విన్నూత కార్యక్రమాలే కాకుండా నైపుణ్య వర్సిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతోంది. డిగ్రీ, ఇంజినీరింగ్‌లో బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సులను ప్రారంభిస్తుండగా కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ను ఇంజినీరింగ్ కళాశాలగా స్థాయిపెంపు.
"విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే ఊచలు లెక్కించాల్సి వస్తుంది"
ఉద్యోగాలు సాధించేలా డిగ్రీ 'న్యూ' సిలబస్ - అప్పటి నుంచే అమల్లోకి