How to Make Mutton Fry : మటన్ ఫ్రై చాలా మందికి ఇష్టం. కానీ.. ప్రిపరేషన్ దగ్గరే చిక్కు వస్తుంది. వంట పూర్తయిన తర్వాత ముక్క నోట్లో పెట్టుకుంటే గట్టిగా ఉంటుంది. దీంతో.. నమలలేక ఇబ్బంది పడుతుంటారు. ఈ పరిస్థితి మీరు కూడా ఫేస్ చేశారా? అయితే.. ఈ స్టోరీ తప్పక మీరు చదవాల్సిందే. ఇక్కడ చెప్పిన విధంగా ప్రిపేర్ చేస్తే.. మటన్ ఫ్రై చాలా సాఫ్ట్‌గా, ఎంతో రుచికరంగా తయారైపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా, ఈజీగా తినేస్తారు. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మరి, ఇక ఆలస్యం చేయకుండా టేస్టీగా మటన్ ఫ్రై ఎలా చేయాలో ఓ లుక్కేయండి..
కావాల్సిన పదార్థాలు :
- మటన్ - అరకేజీ
- లవంగాలు-3
- దాల్చినచెక్క-1
- యాలకులు-3
- పసుపు-పావుటీస్పూన్
- కారం -రుచికి సరిపడా
- గరం మసాలా-టీస్పూన్
- ధనియాల పొడి-టీస్పూన్
- ఉప్పు -రుచికి సరిపడా
- కొత్తిమీర తరుగు- కొద్దిగా
- పుదీనా తరుగు- కొద్దిగా
- ఉల్లిపాయలు-2
- పచ్చిమిర్చి-4
- నూనె -2 టేబుల్‌స్పూన్లు
- కరివేపాకు-2
తయారీ విధానం :
- ముందుగా మటన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు మటన్ ఉడికించుకోవడం కోసం స్టౌపై కుక్కర్ పెట్టండి.
- ఇందులో నూనె పోసి వేడి చేయండి. నూనె వేడయ్యాక యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి కాసేపు వేపండి. తర్వాత శుభ్రంగా కడిగిన మటన్ వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి.
- తర్వాత మూడు గ్లాసుల నీటిని పోసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్లో మటన్ 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి.
- మటన్ మెత్తగా ఉడికిన తర్వాత ముక్కలను సూప్‌లో నుంచి ప్లేట్లోకి తీసుకోండి.
- కుక్కర్లో మిగిలిన నీటితో మటన్ సూప్ తయారు చేసుకోవచ్చు.
- ఇప్పుడు మటన్ ఫ్రై చేయడం కోసం స్టౌపై కడాయి పెట్టండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేయండి. నూనె వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత ఉడికించుకున్న మటన్ ముక్కలు వేసి కలపండి.
- ఇందులో రుచికి సరిపడా కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయండి.
- స్టౌ మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాలు అలా ఉంచండి. తర్వాత కొత్తిమీర, పుదీనా పైన వేసి బాగా మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేయండి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఎంతో కమ్మగా, మృదువుగా ఉండే మటన్ ఫ్రై మీ ముందుంటుంది.
- నచ్చితే ఈ విధంగా మటన్ ఫ్రై ఇంట్లో ట్రై చేయండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
ఘుమఘుమలాడే "తెలంగాణ స్టైల్ తలకాయ కూర" - ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ అదుర్స్!