Harish Rao on TGSRTC Bus Charges : ఆర్టీసీ బస్సు ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజలకు పండుగ సంతోషం లేకుండా చేయటమేనా ప్రజా పాలన అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీమంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికుల ముక్కు పిండి అధిక ధరలు వసూలు చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. పండగ కోసం 140 రూపాయలతో జేబీఎస్ నుంచి సిద్దిపేటకు వెళ్లిన వారు, తిరుగు ప్రయాణంలో రూ.200 చెల్లించాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హన్మకొండ నుంచి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణం సాధారణ రోజుల్లో రూ.300 ఉండేదని, ఇప్పుడు దానిని ప్రభుత్వం రూ. 420కి పెంచిందన్నారు. ఈ మేరకు బస్సు టిక్కెట్ల ఫొటోలను హరీశ్‌రావు ఎక్స్‌లో పంచుకున్నారు. బస్సుల సంఖ్య పెంచకుండా, టికెట్ ఛార్జీలు పెంచి తెలంగాణ ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుండా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.