Nutrition Tips In winter : చలికాలం వచ్చిందంటే చాలు, ప్రజలు చలితో బయట తిరగడానికి భయపడుతూ ఉంటారు. ఉదయం ఏడైనా సూరీడు కనిపించడు. తరచూ పలకరించే జ్వరం, జలుబు, పొడి బారే చర్మం, వైరస్, బ్యాక్టీరియా శీతాకాలంలో సులభంగా వ్యాప్తి చెందుతాయి. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాల్సిన శీతాకాలంలో వ్యాయామం, ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
పదేళ్లలోపు: చలికాలంలో పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. పదేళ్లలోపు పిల్లలకు తరచూ డ్రైఫ్రూట్స్ లడ్డూలు, భోజనంతో పాటు రెండు పూటలు పాలు, ఉడకపెట్టిన గుడ్లు తినిపించాలి.
10-15 ఏళ్లు: ఇనుము, కాల్షియం ఉండే కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. పిల్లలకు నువ్వుల ముద్దలు తినిపిస్తే శరీరానికి వేడితో పాటు కాల్షియం, ఖనిజ లవణాలు అందుతాయి.
15-30 ఏళ్లు: ఈ వయసులో పోషకాలతో కూడిన ఆహారం తినాలి. తాజా కూరగాయలు, కోడిగుడ్డు, నీరు ఎక్కువ తీసుకోవాలి. బ్రౌన్ రైస్‌తో వండిన అన్నం శరీరానికి మంచి పోషకాలను అందిస్తుంది.
30-60 ఏళ్లు: చలికాలంలో త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. సకల పోషకాలున్న జొన్న రొట్టె రక్తకణాల వృద్ధికి దోహదపడుతుంది. వృద్ధులు రాత్రి భోజనంలో నూనె తగ్గించాలి. త్వరగా తిని పడుకోవాలి.
వాటితో రక్షణ : ఎక్కువగా పండ్లు తీసుకుంటే ఏ వయసు వారైనా ఆరోగ్యంగా ఉండవచ్చు. జామ, కమలాలు, బత్తాయి బాగా పని చేస్తాయి. బొప్పాయి, చిటికెడు పసుపుతో పాటు పాలు, అరటి పండ్లు పొట్ట శుభ్రం కావడానికి ఉపయోగపడతాయి. రాగి జావ, బార్లీ, కొంచెం జీలకర్రను అల్లంతో మరిగించి తాగితే త్వరగా జీర్ణం అవుతుంది. చలికాలంలో రక్తపోటు, మధుమేహం, అస్తమా ఉన్న వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వెటర్లు, మాస్కులు ధరించాలి. చేతులకు గ్లౌజులు, పాదాలకు సాక్సులు వేసుకోవాలి.
పిల్లలు భద్రం : చిన్నపిల్లల నుంచి పదిహేను సంవత్సరాల పిల్లల వరకు ఎక్కువగా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. చిన్నారుల్లో ముక్కు దిబ్బడ ఉంటే తరచూ ఆవిరి పట్టాలి. గొంతు నొప్పి ఉంటే గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి పుకిలించాలి. ఉతికిన దుప్పట్లు, పరుపులు మాత్రమే వినియోగించాలి. ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్ పిల్లలకు దగ్గు, జలుబు, జ్వరం రాకుండా కాపాడుతుంది. పడుకునే గదిలోకి చల్లటి గాలి రాకుండా జాగ్రత్తపడాలి.
పెరుగుతున్న న్యూమోనియా కేసులు : చిన్నా, పెద్దా తేడా లేకుండా న్యూమోనియా భారిన పడుతున్నారు. గాలిలోని వైరస్, బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి క్షీణించి ఆయాసం పెరుగుతుంది. మద్యపానం, ధూమపానం అలవాటున్న వారు జాగ్రత్త వహించాలి.
రోజూ నడవాలి : చలి తీవ్రత ఉందని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామం ఆపొద్దు. వృద్ధులు సూర్య కిరణాలు వచ్చిన తర్వాతే నడక ప్రారంభించాలి. ఉదయం వీలు కాకుంటే సాయంత్రం నడవాలి. వ్యాయామ సమయంలో శరీరానికి వెచ్చగా ఉండే స్కార్ఫ్, స్వెట్టరు, టోపీ ధరించాలి. చెమట పట్టేంత వరకు అతిగా వ్యాయామం చేయొద్దు.
ఏ వయసు వారు ఏం తింటే మంచిది - అందంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా?