జగిత్యాలలో మహిళల ద్విచక్ర వాహన ర్యాలీ - జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
Published : Mar 10, 2024, 5:10 PM IST
Women's Two Wheeler Rally in Jagtial : ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సమాజంలో వారు తమకంటూ ఓ ప్రత్యేక హోదాను, గుర్తింపును తెచ్చుకుంటున్నారని తెలిపారు. అంతేకాక కీలక పదవుల్లోనూ రాణిస్తున్నారని, రాజకీయంగానూ తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని వివరించారు. అతివలంతా అగ్రస్థానాన నిలవాలని ఆకాంక్షించారు. మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన మహిళల ద్విచక్రవాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళల ద్విచక్రవాహన ర్యాలీని మున్సిపల్ ఛైర్మన్ ఆడువాల జ్యోతితో కలిసి జీవన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అతివలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జై శ్రీ రామ్ జెండాలతో తహసీల్ చౌరస్తా, కొత్త బస్టాండ్, టవర్ సర్కిల్ మీదుగా ర్యాలీ కొనసాగింది. సమాజంలో మహిళలు అభివృద్ధి పథంలో నడవాలని, వారికి సగభాగంతో పాటు సమానత్వం అవసరమని ర్యాలీలో పాల్గొన్న స్త్రీలు పేర్కొన్నారు. అన్ని రంగాల్లో తమకు సమాన అవకాశాలు, సమాన హక్కులు దక్కాలని వారు ఆకాంక్షించారు.