జాలువారు జలపాతం - ఉప్పొంగెను ప్రతి హృదయం - story on tirathgarh waterfall - STORY ON TIRATHGARH WATERFALL
Published : Jun 18, 2024, 5:40 PM IST
Special Story On Tirathgarh Waterfall : నిత్యం బాంబుల మోతలు, తుపాకీ కాల్పుల శబ్దాలే కాదు, భద్రతా బలగాలు మావోయిస్టుల ఎదురు కాల్పులే కాదు, అక్కడ అడవుల్లో అందమైన ప్రకృతి రమణీయ దృశ్యాలు అందరినీ కనువిందు చేస్తాయి. తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ అటవీ ప్రాంతమంతా ఎన్నో ప్రకృతి అందాలకు నెలవుగా ఉంది. బస్తర్ అటవీ ప్రాంతాల్లో పురాతన కట్టడాలు, జలపాతాలు ఎన్నో సుందరమైన ప్రదేశాలకు ప్రసిద్ధి గాంచింది. అటువంటి వాటిల్లో బస్తర్ జిల్లాలోని 'కాంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్' ఏరియాలో ఉన్న 'తీరజ్గడ్ జలపాతం' పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. అడపాదడపా పడిన వర్షాలకే జలపాతం నీటి పరవళ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ప్రపంచంలోనే అతి ఎత్తైన జలపాతాల్లో తీరజ్గడ్ జలపాతం ఒకటి. ప్రతి ఏటా లక్షల మంది పర్యటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. రెండేళ్ల క్రితం ఈ జలపాతం కిందికి వెళ్లి పర్యటకులు చూసేందుకు రైలింగ్ కట్టారు. పర్యటకులను విశేషంగా ఆకర్షించడం కోసం జలపాతాన్ని దగ్గరగా వీక్షించేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 'గ్లాస్ బ్రిడ్జిను' నిర్మించడానికి సంసిద్ధమయ్యింది. దీని నిర్మాణం పూర్తయినట్లయితే పర్యటకులు జలపాతాన్ని మరింత దగ్గరగా చూసి పులకించే రోజు దగ్గరలోనే ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.