ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నూతన భవనాన్ని వీలైనంత త్వరగా నిర్మించాలి : ప్రొఫెసర్ కోదండరాం - Prof Kodandaram On Osmania Hospital - PROF KODANDARAM ON OSMANIA HOSPITAL
Published : May 28, 2024, 8:28 PM IST
|Updated : May 28, 2024, 8:34 PM IST
Prof Kodandaram On Osmania Hospital : పేదల పెద్దాసుపత్రి ఉస్మానియాకు నూతన భవన నిర్మాణం విషయంలో ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. 'ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం ఏర్పాటు' అనే అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. ఆసుపత్రి భవనాన్ని వీలైనంత త్వరగా నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
గత ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రి సమస్యను పట్టించుకోలేదన్న ఆయన త్వరలోనే సర్కారుతో నూతన భవనం నిర్మాణం విషయమై చర్చిస్తామన్నారు. ప్రభుత్వం ఓ కొత్త భవనాన్ని నిర్మిస్తే ఎంతో మంది పేదవారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఓ మంచి పనికి కృషి చేస్తున్న డాక్టర్లకు తమ సహకారం ఉంటుందని తెలియజేశారు. ఈ సమస్యను త్వరలోనే ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు.
సర్కారు చొరవ చూపించి ఆసుపత్రి భవనాన్ని త్వరగా నిర్మించాలని ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ రమేష్ కోరారు. చంచల్ గూడ జైలు వద్ద ఉన్న ప్రింటింగ్ ప్రెస్ ప్రాంతం లేదంటే పేట్లబుర్జ్ ప్రాంతాల్లో కొత్త భవనం నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రస్తుతం సమస్య కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో సర్కారు వీలైనంత త్వరగా కోర్టుకు తమ నిర్ణయం తెలియజేయాలని కోరారు.