ప్రధానితో రోహిత్ సేన భేటి - ప్లేయర్లతో మోదీ సరదా ముచ్చట - Team India Meets PM Modi - TEAM INDIA MEETS PM MODI
Published : Jul 4, 2024, 1:52 PM IST
PM Modi Meets Team India : టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యులు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రత్యేక బస్సుల్లో పటిష్ట భద్రత మధ్య వాళ్లందరూ ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వారిని స్వాగతించిన మోదీ, ఉత్కంఠ భరిత పోరులో ప్రపంచ విజేతలుగా నిలిచిన జట్టును అభినందించారు. జట్టు సభ్యులను పేరుపేరునా పలకరించారు. వారితో సరదాగా సంభాషించారు. ఇక ప్లేయర్లు కూడా తమ అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
17 ఏళ్ల సుధీర్ఘ విరామానికి తెరదించుతూ దక్షిణాఫ్రికాపై విజయంతో భారత జట్టు టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్‌లోనే నిలిచిపోయిన భారత జట్టు సభ్యులు ఈ ఉదయం ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన అభిమానులు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత జట్టు సభ్యులకు ఘన స్వాగతం పలికారు. ఇక ప్లేయర్లు కూడా ఎంతో ఉత్సాహంగా అభిమానులకు వందనం చేసుకుంటూ వెళ్లారు. రెండు ప్రత్యేక బస్సుల్లో దిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకున్నారు.