బీసీలందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే కులగణన : మంత్రి పొన్నం ప్రభాకర్ - Ponnam Caste enumeration telangana
Published : Feb 1, 2024, 8:07 PM IST
Minister Ponnam Prabhakar on Caste enumeration : బీసీలందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కుల గణనకు పూనుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చట్టపరంగా గణన జరగాలనే ఉద్దేశంతోనే మేధావుల సలహాలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన సాధన కోసం ఏర్పాటు చేసిన బీసీ మేధావుల, విద్యావంతుల సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, రాష్ట్రంలో కులగణన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
బలహీన వర్గాలకు సంబంధించి మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తామని తెలిపారు. కులగణన ప్రస్తావన ఏనాటి నుంచో ఉందని, అధిక సంఖ్యలో ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే సమగ్ర కులగణన జరగాలని మేధావులు కోరారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ఎస్సీలకు బలమైన నాయకుడైన అంబేడ్కర్ అండగా నిలిచి రిజర్వేషన్స్ కల్పించారని పేర్కొన్నారు. బీసీలకు సరైన నాయకుడు లేక ఇప్పటికీ వాటి కోసం కొట్లాడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేధావులు, విద్యావంతులు, హైకోర్ట్ న్యాయమూర్తులతో పాటు బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ రాములు పాల్గొన్నారు.