'ఉన్నది ఒకటే జిందగీ - నెలలో ఓ 2 పర్యాటక ప్రదేశాలకైనా వెళ్లిరండి' - Jupally Participates In Bike Rally - JUPALLY PARTICIPATES IN BIKE RALLY
Published : Sep 22, 2024, 1:01 PM IST
Minister Jupally Participates In Bike Rally in Hyderabad : ఒకే ఒక జీవితం. మరో జన్మ ఉంటుందో? లేదో. అందుకని ప్రతి వ్యక్తి కనీసం నెలకు రెండు రోజులైనా వివిధ పర్యటక ప్రాంతాలకు వెళ్లాలని ఆ శాఖ మంత్రి జూపల్లి అన్నారు. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ బుద్ధవనానికి బైక్ ర్యాలీ తీశారు. బేగంపేట టూరిజం ప్లాజాలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ బైక్ రైడర్స్ సంయుక్తంగా నిర్వహించిన రైడ్ టు ర్యాలీలో మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో సుమారు 330 ద్విచక్ర వాహనాలతో మహిళలు, పురుషులు పాల్గొన్నారు.
ఈ నెల 27న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మనకున్న జీవితం ఒక్కటేనని, ఇందులో కనీసం నెలకు రెండు రోజులైనా వివిధ ప్రాంతాలకు వెళ్లాలన్నారు. అలా వెళ్లడం వల్ల మనసుకు ఆహ్లాదం, ఆనందం కలుగుతుందని, జీవితంలోని సగం సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు.