నడిరోడ్డుపై కారు ఆపి 2.5కిలోల బంగారం చోరీ - Gold Robbery On Road - GOLD ROBBERY ON ROAD
Published : Sep 26, 2024, 6:22 PM IST
Gold Robbery On Road : నడిరోడ్డుపై వ్యాపారి కారును ఆపి బంగారాన్ని చోరీ చేసిన ఘటన కేరళలోని త్రిసూర్‌లో జరిగింది. పట్టపగలు కత్తులు, గొడ్డళ్లతో వ్యాపారిని బెదిరించి 2.5 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దొంగల ముఠాకు చెందిన కారును ఓ మెకానిక్ షెడ్లో గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం- అరుణ్ సన్నీ అనే వ్యాపారి 2.5 కిలోల బంగారు ఆభరణాలను తీసుకుని కారులో కోయంబత్తూరు నుంచి త్రిసూర్‌కు బుధవారం బయలుదేరారు. ఉదయం 11 గంటల సమయంలో కుతిరన్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు మూడు కార్లలో అరుణ్ వాహనాన్ని వెంబడించారు. ఆ తర్వాత కత్తులు, గొడళ్లతో బెదిరించి కారు నుంచి బయటకు రప్పించారు. అనంతరం బంగారాన్ని దోచుకున్నారు.
ఆ తర్వాత మరో వాహనంలో దొంగలంతా పరారయ్యారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అవ్వగా, పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేపట్టారు. దొంగల కారును పుత్తూరులోని మెకానిక్ షెడ్లో ఉన్నట్లు కనుగొన్నారు. విచారణలో మిగతా కార్ల నంబర్ ప్లేట్లు నకిలీవని గుర్తించారు. వివిధ ఆధారాలతో దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.