హైడ్రా పేరుతో పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు : కేటీఆర్ - KTR VISIT FATEH NAGAR STP
Published : Sep 25, 2024, 12:16 PM IST
KTR Visit Fateh Nagar STP : నగరంలో ఎస్టీపీలు పూర్తయితే వందశాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్ మారుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన బుధవారం రోజున ఫతేనగర్ ఎస్టీపీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎస్టీపీల నిర్మాణంలో వేగం తగ్గిందని తెలిపారు. ఎస్టీపీకి సంబంధించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న కేటీఆర్, పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.
కూకట్‌పల్లి నాలాను శుద్ధి చేయాలని అధికారులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ను మురికినీటి రహితంగా మార్చాలనే గొప్ప లక్ష్యంతో ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో మొత్తం 31 ఎస్టీపీల నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. హైడ్రా పేరుతో పెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా చర్యలపై త్వరలో తమ పార్టీ ఎమ్మెల్యేలంతా చర్చిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతామని స్పష్టం చేశారు.