శ్రీ చైతన్యలో విద్యార్థుల మధ్య ఘర్షణ - రాడ్లతో దాడి, ముగ్గురికి తీవ్ర గాయాలు - Clash between students in Chaitanya
Published : Mar 2, 2024, 7:55 PM IST
Kompally Sri Chaitanya Students Clash : పాఠశాల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు విద్యార్థులు తీవ్ర గాయాలు అయిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కొంపల్లి శ్రీ చైతన్య స్కూల్లో శనివారం ఉదయం 8 గంటలకు బ్రేక్ సమయంలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు, 9వ తరగతి చదువుతున్న మరొక విద్యార్థి ఒకచోట ఉండి మాట్లాడుకుంటూ ఉండగా పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఏడుగురు వారిపై రాడ్లతో తీవ్రంగా దాడి చేశారు. దీంతో ఆ ముగ్గురు విద్యార్థులు తలకు గాయాలవటంతో సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.
ముగ్గురు విద్యార్థుల తలకు తీవ్ర గాయాలు అవటంతో కుట్లు వేసి పాఠశాలకు పంపించినట్లు వైద్యులు చెబుతున్నారు. గొడవ విషయం గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు మొదట స్కూల్కు వచ్చి అనంతరం అక్కడి నుంచి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అయితే అక్కడ పోలీసులు ఇది పాఠశాల విద్యార్థులకు చెందిన సున్నితమైన అంశమని, కేసు వరకు వెళ్తే పిల్లల భవిష్యత్ ఆగమయ్యే అవకాశం ఉందని, స్కూల్లోనే చర్చించుకోవాల్సిందిగా సూచించినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో గాయపడిన తమ పిల్లలకు న్యాయం చేయాల్సిందిగా తల్లిదండ్రులు పాఠశాల నిర్వాహకులను డిమాండ్ చేస్తున్నారు.